ప్రజల సొమ్ము ఇస్తూ.. విరాళం కటింగ్ ఎందుకో?

Update: 2020-04-06 00:30 GMT
విరాళం అంటే సొంతంగా సంపాదించింది అయి ఉండాలి. లేదంటే.. వారసత్వంగానో.. మరోరూపంలోనో ఆస్తులుగా సంక్రమించింది అయి ఉండాలి. అంతేకానీ.. ప్రజాసేవ కోసం ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని డెవలప్ మెంట్ కోసం ఖర్చు చేయకుండా.. విరాళాల రూపంలో ప్రకటించటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఎంపికైన ఎంపీలకు కేంద్రం ఖర్చు చేసేందుకు వీలుగా ప్రతి ఒక్క ఎంపీకి నిధులు ఇవ్వటం తెలిసిందే.

ఇలాంటి ఎంపీ లాడ్స్ ను తాజాగా కొందరు నేతలు కరోనా వైరస్ మీద పోరాడేందుకు ప్రభుత్వానికి.. విరాళంగా ప్రకటిస్తూ కటింగ్ ఇస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఎంపీలు తమ జేబుల్లో నుంచో.. తమ ఇంట్లోని భోషాణాల్లో నుంచి డబ్బులు తీసి ఇస్తే విరాళం అవుతుంది. అందుకు భిన్నంగా ప్రజలు కట్టిన పన్ను మొత్తాన్ని నిధుల రూపంలో ఎంపీలకు ప్రభుత్వాలు ఇస్తే.. తిరిగి వాటినే విరాళాల రూపంలో ఇవ్వటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పలువురు ఎంపీలు గొప్పగా.. తమ ఎంపీ లాడ్స్ ను విరాళాలుగా ఇస్తూ గొప్పలు ప్రదర్శిస్తున్నారు. భారీ ప్రకటనలు ఇస్తున్నారు. దీనికి తగ్గట్లే మీడియాలోనూ ఫలానా ఎంపీ కోట్లాది రూపాయిల్ని విరాళంగా ఇస్తున్నట్లుగా వార్తలు రాస్తున్నారు. వాస్తవానికి వారు ఇస్తున్న నిధులు మొత్తం ప్రభుత్వం వారికి ఇచ్చేదే తప్పించి.. వారి జేబుల్లో నుంచి ఇస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని చెబుతున్నారు. ప్రజల కోసం ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని.. తిరిగి ప్రభుత్వానికి  ఇచ్చేస్తూ.. అదేదో విరాళమన్న కలరింగ్ ఇవ్వటం ఏ మాత్రం సరికాదంటున్నారు.


Tags:    

Similar News