ఎన్నాళ్లకెన్నాళ్లకు:​ సఫారీల మీద మనోళ్ల​ సవారీ

Update: 2015-10-15 05:34 GMT
ఇన్నింగ్స్ ముగియటానికి ఒక్క ఓవర్ ఉండి.. చేతిలో ఒక్క వికెట్ ఉన్న వేళ.. బ్యాట్సమెన్లు ఎంత ఆచితూచి ఆడతారనటానికి బుధవారం టీమిండియా బ్యాటింగ్ చేస్తే ఇట్టే తెలుస్తుంది. చివరి ఓవర్లో మొదటి ఐదు బంతులకు చేసిన పరుగులు సున్నా. ఓ వైపు బంతులు అయిపోతున్నా.. ఆచితూచి ఆడేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు బ్యాట్స్ మెన్ ఉన్న కెప్టెన్ ధోనీ. అతనికి తెలుసు.. స్వల్పంగా ఉన్న స్కోర్ నేపథ్యంలో.. ఒక్క పరుగు కూడా మ్యాచ్ మలుపు తిప్పుతుందని.

అందుకే కాబోలు లైవ్ లో అభిమానులు చావు తిట్లు తిడుతున్నా.. అదేమీ పట్టించుకోనట్లు తన వ్యూహాన్ని అమలు చేసేందుకే ప్రాధాన్యత ఇచ్చాడు. ఎక్కడా తడబాటుకు గురి కాలేదు. చివరి బంతికి తనకు అనుకూలంగా పడటం.. వెంటనే దాన్ని సిక్సర్ పంపటం ద్వారా తొమ్మిది వికెట్ల నష్టానికి247 పరుగులు చేసి.. దక్షిణాఫ్రికా  విజయలక్ష్యంగా 248 పరుగుల్ని ఫిక్స్ చేసింది. ఈ మాత్రం స్కోర్ రావటానికి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన ధోని పుణ్యమే. ఈ మొత్తం స్కోర్ లో ధోని వ్యక్తిగత స్కోర్ 92 పరుగులు ఉన్నాయి. ఇన్నింగ్స్ చివరి బంతి వరకూ ఆచితూచి ఆడుతూ.. అవకాశం వచ్చిన బంతిని కఠినంగా శిక్షించటంతో ఈ స్కోర్ చేయగలిగారు.

సఫారీల బ్యాటింగ్ లైనప్ చూసిన వారికి.. ఈ స్కోర్ పెద్దదేమీ కాదనిపించక మానదు. నిప్పులు చెరిగే బ్యాట్స్ మెన్లతో ఉన్న ఆ జట్టు అలవోకగా విజయం సాధిస్తుందని.. బ్యాటింగ్ కు ముందే టీమిండియా సగటు అభిమాని ఫిక్స్ అయినా.. లోపల ఏదోఒక ఆశ. క్రికెట్ లో ఏదైనా సాధ్యమనే సూత్రాన్ని గుర్తు తెచ్చుకుంటూ.. అద్భుతం జరగకపోతుందా? అని ఎదురుచూసిన దానికి తగ్గట్లే ధోనీ జట్టు మేజిక్ చేసేసింది.

బ్యాట్సమెన్లు దారుణంగా విఫలమైన పెద్ద స్కోర్ ఏమీ చేయకున్నా.. స్పిన్నర్లు తమ విశ్వరూపం చూపించటంతో సఫారీలు తమ పోరాటాన్ని 225 పరుగులకే ముగించి.. ఓటమి పాలయ్యారు.

స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సఫారీలు తొలి ఆరు ఓవర్లలో సాధించిన పరుగులు 36. కానీ.. ఆ ఊపు.. ఉత్సాహం ఎంతోసేపు సాగకుండా బౌలర్లు పట్టుబిగించటంతో మ్యాచ్ కాస్త మలుపు తిరగటమే కాదు.. దక్షిణాఫ్రికా జరుపుతున్నటూర్లో మొదటి విజయాన్ని నమోదు చేశారు.

ఐదు వన్డే మ్యాచ్ సిరీస్ లో 1-1 సమం చేశారు. పది ఓవర్లకు రెండు వికెట్లు తీసినప్పటికీ మ్యాచ్ గెలుస్తామన్న భరోసా టీమిండి జట్టును అభిమానించే వారికి లేదు. అయితే.. స్పిన్నర్లు అంతా కలిసి కట్టుగా రాణించటం టీమిండియాకు రాణించింది. దీంతో.. సఫారీల టాప్ బ్యాట్స్ మెన్లు తడబాటుకు గురి కావటంతో వారి బ్యాటింగ్ వ్యవస్థ కుప్పకూలింది. స్పిన్నర్లతోపాటు.. కోహ్లీ కూడా రాణించటం ఈ విజయంలో కీలకపాత్ర పోషించారని చెప్పాలి. బ్యాట్స్ మెన్ గా ఫెయిల్ అయినా.. ఫీల్డింగ్ లో మూడు క్యాచ్ ల్ని పట్టుకోవటంతో మ్యాచ్ పై పట్టు సాధించేందుకు వీలైంది. సమిష్ఠిగా కృషి చేయాలే కానీ.. స్వల్ప స్కోర్ తోనూ సంచలన విజయం సాధించొచ్చన్న విషయాన్ని తాజా మ్యాచ్ తో టీమిండియా రుజువు చేసిందని చెప్పొచ్చు.​
Tags:    

Similar News