ధోనీకి ప‌ద్మ‌భూష‌ణ్ అంద‌ని ద్రాక్షేనా?

Update: 2017-09-23 09:25 GMT
టీమిండియా మాజీ కెప్టెన్‌ - మిస్ట‌ర్ కూల్‌ మహేంద్ర సింగ్ ధోనీ పేరు తెలియ‌ని క్రికెట్ అభిమాని ఉండ‌డు. ఇటువంటి వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ త‌మ జ‌ట్టులో ఉండాల‌ని ప్ర‌తి కెప్టెన్ కోరుకుంటాడు. మ‌రే కెప్టెన్ కు సాధ్యం కాని రీతిలో త‌న జ‌ట్టుకు టీ20 - వ‌న్డే ప్ర‌పంచ క‌ప్‌ - ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలను అందించిన గొప్ప కెప్టెన్. 302 వన్డేలలో 10 సెంచ‌రీల‌తో 9737 పరుగులు - 90 టెస్టుల్లో 6 సెంచ‌రీల‌తో 4876 పరుగులు - 78 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ ల్లో1212 పరుగులు - మొత్తంగా 100 అర్ధ శ‌త‌కాలు - టెస్టుల‌లో 256 క్యాచ్ లు - వ‌న్డేల్లో 285 క్యాచ్ లు - టీ 20ల్లో 43 క్యాచ్ లు....ఇదంతా ధోనీ ట్రాక్ రికార్డ్‌. ఇప్పటికే అర్జున - రాజీవ్‌ ఖేల్‌ రత్న - పద్మశ్రీ వంటి అవార్డులు అందుకున్న మేటి ఆట‌గాడు. దేశంలో మూడో అత్యున్న‌త పౌర పుర‌స్కారం  ప‌ద్మభూష‌ణ్ కు ధోనీ అన్ని విధాలా అర్హుడే. అందుకే, ధోనీ పేరును ఈ ఏడాది ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డుకు బీసీసీఐ ఏక‌గ్రీవంగా నామినేట్ చేసింది. ఇదంతా నాణేనికి ఒక వైపు. నాణేనికి మ‌రోవైపు ప‌రిస్థితి వేరేలా ఉంది. ధోనీకి ఈ ఏడాది ప‌ద్మ భూషణ్ అవార్డు ఇవ్వ‌డానికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సుముఖంగా లేద‌ని తెలుస్తోంది. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే, ఈ ఏడాదే కాదు, అస‌లు భ‌విష్య‌త్తులో కూడా ధోనీకి ప‌ద్మభూష‌ణ్ వ‌చ్చే అవ‌కాశాలు లేవ‌ని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం

ధోనీకి ప‌ద్మ భూష‌ణ్ అవార్డును కేంద్రం ప్రభుత్వం తిర‌స్క‌రించ‌డం ఇది మొద‌టిసారేమీ కాదు. 2013 - 2016లో కూడా ధోనీ పేరును బీసీసీఐ ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డుకు నామినేట్ చేసింది. ఆ రెండు సంద‌ర్భాల్లోనూ బీసీసీఐ ప్ర‌తిపాద‌న‌ను కేంద్రం తిరస్కరించింది. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్య‌వ‌హారంలో భాగంగా చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్ కే) పై రెండేళ్ల పాటు నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. స్పాట్ ఫిక్సింగ్ కేసులో భాగంగా ధోనీని కూడా విచార‌ణ చేశారు. అయితే, ఫిక్సింగ్ తో ధోనికి సంబంధాలున్నట్లు రుజువు కాలేదు. ధోనీ... ఇండియా సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న విషయం బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. అయితే, సీఎస్ కే లో బీసీసీఐ మాజీ అధ్య‌క్షుడు, ఇండియా సిమెంట్స్ అధినేత‌ శ్రీ‌నివాస‌న్ అల్లుడు మేయ‌ప్ప‌న్ పాత్ర‌పై ధోనీ స్ప‌ష్ట‌మైన స‌మాధాన‌మివ్వ‌లేద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. సీఎస్ కేలో మేయ‌ప్ప‌న్ పాత్ర గురించి ధోనీ విచార‌ణ క‌మిటీకి అబ‌ద్ధం చెప్పాడ‌ని క్రీడా మంత్రిత్వ శాఖ అధికారి ఒక‌రు వెల్ల‌డించిన‌ట్లు 2013లో జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ కార‌ణాల‌తోనే  ప్రతిష్టాత్మక ప‌ద్మ భూష‌ణ్ అవార్డుకు ధోనీ పేరును 2013, 2016లో తిరస్కరించారు. తాజాగా, అవే కార‌ణాల‌తో ధోనీ పేరును తిర‌స్క‌రించిన‌ట్లు జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ధోనీ దేశం గ‌ర్వించ‌ద‌గ్గ గొప్ప క్రికెట‌ర్ అని కేంద్రం కూడా భావిస్తున్న‌ప్ప‌టికీ స్పాట్ ఫిక్సింగ్ విచార‌ణ నేప‌థ్యంలో ధోనీకి పద్మభూషణ్ ఇవ్వడానికి మొగ్గు చూపడం లేద‌ని తెలుస్తోంది. ఈ ఏడాదే కాద‌, భ‌విష్య‌త్తులో కూడా ధోనీకి ప‌ద్మ భూష‌ణ్ వ‌చ్చే అవకాశాలు క‌నిపించ‌డంలేద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ధోనీకి ప‌ద్మ భూష‌ణ్ అవార్డు అంద‌ని ద్రాక్షే అవుతుందా? లేదా? అన్న ప్ర‌శ్న‌కు కాల‌మే స‌మాధాన‌మివ్వాలి!
Tags:    

Similar News