అందరిలా జగన్ ఉండకూడదు... ఇట్లు శ్రేయోభిలాషి ముద్రగడ 

Update: 2023-01-13 09:42 GMT
జగన్ అంటే కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభానికి ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని అంటారు. ఆ మాటకు వస్తే ముద్రగడ వైఎస్సార్ ని బాగా ఇష్టపడేవారు అని చెబుతారు. ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం లో పనిచేశారు. చంద్రబాబుతో పాటు ఆ పార్టీలో కొనసాగారు. బాబు గురించి దగ్గరుండి అంతా చూశారు.

అలాగే వైఎస్సార్ ని ఆయన గమనించారు. ఆ తండ్రి కుమారుడిగా జగన్ విషయంలోనూ ముద్రగడకు కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది అంటారు. జగన్ కాపులకు రిజర్వేషల అంశం తన పరిధిలో లేదని ముద్రగడ ప్రాంతానికే వచ్చి గట్టిగా చెప్పినా ఆయన ఏమీ అనలేదు. జగన్ మాటలలో నిబద్ధతనే ఆయన చూశారని అంటారు.

అందుకే జగన్ సీఎం అయ్యాక ఒక సందర్భంలో ఆయనకు లేఖ రాస్తూ మీరు కాపులకు రిజర్వేషన్లు అని ఎలాంటి హామీ ఇవ్వలేదు కాబట్టి అడగలేకపోతున్నాం కానీ మీరు కాపుల కోసం మంచి చేసే ప్రయత్నం చేయండి రాశారు. ఆ మీదట తరచూ అనేక సమస్యల మీద ముద్రగడ జగన్ కి లేఖలు సంధిస్తూ వస్తున్నారు

మరో వైపు చూస్తే గోదావరి జిల్లాలకు అంబేద్కర్ పేరు పెట్టాలని ముద్రగడ గతంలో లేఖ రాయడం, దాని మీద జగన్ సానుకూలంగా స్పందించడం జరిగిపోయాయి. ఇక ఈ మధ్యనే ముద్రగడ జగన్ కి ఒక లేఖ రాశారు. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు ఈబీసీ కోటా నుంచి ఇవ్వాలని అందులో కోరారు. మీరు అలా చేస్తే మీకు అంతా మంచే జరుగుతుంది అని ఆయన చెప్పడం విశేషం. మీరు బాగా ఉండాలని కోరుకుంటూ ఈ లేఖ రాస్తున్నాను అని ఒక శ్రేయోభిలాషిలాగానే ఆయన లేఖ రాశారు.

ఇక లేటెస్ట్ గా ముద్రగడ మరో లేఖ సంధించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే వారు జీవితాంతం జగన్ కి రుణపడి ఉంటారు అని ముద్రగడ అందులో కోరారు. కాపుల విషయంలో అన్ని పార్టీలు వాడుకుని వదిలేశాయని మీరు మాత్రం అందరిలా ఉండరాదు అన్నదే తన కోరిక అని ముద్రగడ ఒక పెద్దన్నయ్యలా జగన్ కి హితబోధ చేయడమే ఈ లేఖలో ప్రత్యేకత.

అంతే కాదు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అన్యాయం జరుగుతోందని, అలాంటి పరిస్థితులలో వారి రిజర్వేషన్ల అంశం విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకుని మంచి ముగింపు పలకాలని జగన్ కి ముద్రగడ విన్నవించారు.

కాపులకు రిజర్వేషన్ల కోరిక అన్నది సమంజసం, న్యాయమైనది అని అసెంబ్లీలో జగన్ అన్నట్లుగా తాను విన్నానని, చాలా సంతోషించానని ఆయన గతాన్ని గుర్తు చేశారు. పైగా కాపు నాయకుల కన్నా జగన్ మద్దతు ఇస్తూ మంచిగా మాట్లాడారని కూడా అంతా చెప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు. అందువల్ల మీరు కాపులకు రిజర్వేషన్లు ఇస్తే కనుక ఆ జాతి చాలా సంతోషిస్తుంది. ఇది మీకు అన్ని విధాలుగా మంచి చేస్తుంది అని ముద్రగడ పేర్కొనడం విశేషం.

మొత్తానికి ఒక మంచి మిత్రుడిగా జగన్ మేలు కోరేవారిగా వరసబెట్టి ముద్రగడ రాస్తున్న ఈ లేఖలు జగన్ మనసును కదిలిస్తాయా అని అంతా చూస్తున్నారు. జగన్ ఏమి చేసినా చెప్పరు. ఆయన చివరి నిముషంలో ట్విస్ట్ ఇస్తారు. ఇక జగన్ వైపు నుంచి చూసుకుంటే ముద్రగడ పట్ల ఆయనకు కూడా మంచి అభిప్రాయం ఉంది. పైగా ఆయన్ని తన పార్టీలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు.

ముద్రగడ కాపులకు రిజర్వేషన్ల కోసమే దీక్ష చేశారు. మరి ఆయన కోరిక తీర్చే అవకాశం ఇపుడు జగన్ చేతిలో ఉంది. ఈబీసీలలో అయిదు శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఒక చట్టం తీసుకువస్తే ఎవరూ కాదనరు. బీసీలకు కూడా అది ఇబ్బంది కాదు, మరో వైపు చూస్తే కాపుల ఓట్ల కోసం చంద్రబాబు పవన్ గట్టిగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది.

దాంతో వన్ షాట్ మెనీ బర్డ్స్ అన్నట్లుగా జగన్ తన ముందు ఉన్న ఈ రిజర్వేషన్ల విషయాన్ని పరిష్కరించడం ద్వారా మొత్తం ఏపీ రాజకీయాన్ని తనకు అనుకూలం చేసుకుంటారని అంటున్నారు. ఫిబ్రవరి లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన చట్టం చేస్తారని అంటున్నారు. సో అదే జరిగితే ముద్రగడ జై జగన్ ఆన్నా ఆశ్చర్యం లేదు అంటున్నారు. అపుడు గోదావరి జిల్లా సమీకరణలు మొత్తం మారిపోవడం ఖాయం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News