ఉద్యమ సైరన్ మోగించిన ముద్రగడ

Update: 2016-10-05 04:59 GMT
కాపుల్ని బీసీల్లోకి చేర్పించాలన్న డిమాండ్ పై మరోసారి తన ఉద్యమ సైరన్ ను పూరించారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయ‌ణ‌రావు నేతృత్వంలో రాజమహేంద్రవరంలో ఒక సమావేశం జ‌రిగింది. ఈ మీటింగ్ కు ముద్రగడ పద్మనాభం మొదలు.. పలువురు కాపు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాపుల్ని బీసీల్లోకి చేర్చాలన్న డిమాండ్ ను ఎలా సాకారం చేసుకోవాలన్న అంశంపై చర్చించారు.

ఈ సందర్భంగా పలువురు ఇచ్చిన సలహాలు.. సూచనల అనంతరం చివరకు ఒక కార్యాచరణను సిద్ధం చేశారు. దీని ప్రకారం.. తొలి దశలో ప్రతి 15 రోజులకోసారి ఏపీలోని ప్రతి జిల్లాలోనూ కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ నిరసనలు చేపట్టాలని.. ముఖ్యనేతలంతా ఈ నిరసన కార్యక్రమాలకు హాజరు కావాలని తేల్చారు. కాపుల కోసం పోరాడుతున్న ముద్రగడ ఒంటరి కాదు. ఆయన వెనుక మద్దతుగా కాపు కాసే నేతలు కాపునేతలంతా ఉన్నారన్న సందేశాన్ని ఏపీ సర్కారుకు పంపాలని నిర్ణయించారు.
 
నిరసనల్లో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కాపు ఐక్య కార్యాచరణ కమిటీలు ఏర్పాటు చేయాలని.. అందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేయాలని నిర్ణయించారు. తొలిదశ నిరసన కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత.. కాపుల రిజర్వేషన్ల సాధన కోసం ముద్రగడ పాదయాత్ర చేయటం లేదంటే సత్యాగ్రహం చేయటం లాంటివి చేపట్టాలని నిర్ణయించారు.

కాపుల్ని బీసీల్లోకి చేర్చాలన్న న్యాయమైన కోర్కెపై గ్రామస్థాయిలో అవగాహన తీసుకురావటం.. వారిలో ఉద్యమ స్ఫూర్తిని నింపటం.. ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరటం న్యాయమైనదే కానీ అన్యాయమైన డిమాండ్ కాదన్న విషయాన్ని అన్ని వర్గాలకు అర్థమయ్యేలా చేయాలని నిర్ణయించారు. తమను వేధించేందుకు పలు కేసులు పెడుతుందని ముద్రగడ ప్రభుత్వాన్ని విమర్శించారు. తనపై పీడీ యాక్ట్ పెట్టినా.. వెనక్కి తగ్గేది లేదని చెప్పిన ముద్రగడ.. కాపులు కోరుతున్న రిజర్వేషన్లకు బీసీలు వ్యతిరేకం కాదని తేలిందని చెప్పుకొచ్చారు. బీసీల వాటా తగ్గించి కాపులకు రిజర్వేషన్లు ఇవ్వమని తాము కోరని నేపథ్యంలో బీసీలు తమను వ్యతిరేకించటం లేదన్నారు. ముద్రగడ తాజా నిరసన ప్రణాళిక ఏపీ సర్కారును సమస్యల సుడిగుండంలో చిక్కుకునేలా చేస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ తానిచ్చిన హామీ అమలు విషయంలో చిత్తశుద్దితో అమలుచేసే ప్రయత్నం చేయకుంటే తిప్పలు తప్పవంటున్నారు. మరి.. దీనిపై చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News