ముద్ర‌గ‌డ నిప్పు రాజేస్తున్నారు

Update: 2017-04-03 06:24 GMT
కాపుల‌ను  బీసీల్లో చేర్చాల‌ని పెద్ద ఎత్తున ఉద్య‌మం చేసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఒకింత గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ త‌న పోరాట అజెండాను ఎత్తుకున్నారు. ప్ర‌భుత్వం అణిచివేసినంత మాత్రాన  తాము వెన‌క అడుగువేసిన‌ట్లు కాద‌ని ఆయ‌న తెలిపారు.  కాపులకు రిజర్వేషన్లు అమలు చేసే వరకూ కాపు ఉద్యమం ఆగదని ముద్ర‌గ‌డ ప‌ద్మనాభం స్ప‌ష్టం చేశారు. ఈ పోరాటంలో కలిసొచ్చేవారిని కలుపుకుని ఉద్యమం ఉధృతం చేస్తామని వివ‌రించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఓ వివాహానికి హాజరయిన అనంత‌రం ఆయన మీడియాతో మాట్లాడారు.

కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు సాధించేందుకు జనసేన నాయకుడు పవన్‌ కళ్యాణ్‌ ను ప్రత్యేకంగా పిలవనవసరం లేదని, మద్దతిస్తే కలుపుకుని పోతానని ముద్ర‌గ‌ద ప‌ద్మనాభం అన్నారు. తమ ఉద్యమానికి ఏ ఒక్కర్నీ బొట్టు పెట్టి పిలవట్లేదని, స్వచ్ఛందంగా మద్దతిచ్చేవారిని కలుపుకెళ్తామని చెప్పారు. గతంలో పవన్‌కళ్యాణ్‌ మద్దతు కోరితే ఆయన స్పందించలేదని చెప్పారు. 2014 ఎన్నికలప్పుడు కాపులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు తుంగలోకి తొక్కారని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం విమర్శించారు. పైగా ఉద్యమాన్ని అణచేందుకు విషప్రచారం చేయిస్తున్నారని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. వైసీపీతో కుమ్మక్యయ్యామని, ప్యాకేజీకి అమ్ముడుపోయామంటూ రోజుకో రకంగా విమర్శలు చేస్తూ అడుగడుగునా అవమానించారని ప‌ద్మనాభం ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే వైసీపీతో తమకున్న సంబంధాన్ని నిరూపించాలని, లేకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు. టీడీపీలోని కాపు నేతలు ఇప్పటికైనా చంద్రబాబు విషపు రాజకీయాలను గుర్తించాలని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కోరారు. విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమాలాంటి వారు పదవుల ఆశతో తమను ఇష్టానుసారం తిట్టారని, ఇప్పుడు మంత్రి పదవి దక్కకపోయే సరికి ఒక్కసారిగా కాపులు గుర్తుకొచ్చారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతివ్వాలో భవిష్యత్తులో నిర్ణయిస్తామని ముద్రగడ చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News