ముద్రగడ చూపు ఆ పార్టీ వైపే... సీటు అదేనట...?

Update: 2023-05-05 15:02 GMT
కాపు నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మళ్లీ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించాలని అనుకుంటున్నారా అన్నది చర్చకు వస్తోంది. ఆయనను ఇప్పటికే బీజేపీ వైసీపీ అనేకసార్లు తమ పార్టీలలోకి రావాలని ఆహ్వానించారని తెలుస్తోంది. అయిత తుని రైలు ఘటన కేసు తేలకనే ఏ సంగతీ చూద్దామని ముద్రగడ అప్పట్లో చెప్పారని అంటున్నారు. ఇపుడు తుని రైలు ఘటన కేసు కోర్టులో కొట్టేసారు. ఒక విధంగా ముద్రగడ ఫ్రీ బర్డ్. ఆయన మరోమారు రాజకీయాల్లో దిగాలని చూస్తున్నారు అని అంటున్నారు.

ముద్రగడ వైఖరి తీసుకుంటే ఆయన తెలుగుదేశలో చేరరు అన్నది అందరికీ తెలిసిందే. చంద్రబాబుకు ఆయన ఆపోజిట్ గానే పనిచేస్తారని అంటున్నారు. ఇక టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్న జనసేన వైపు ఆయన చూసేది లేదు అని అంటున్నారు. దాంతో  ముద్రగడ ముందు బీజేపీ వైసీపీ ఆప్షన్లుగా ఉన్నాయి. బీజేపీ పొత్తులతో టీడీపీకి వెళ్ళినా లేక ఒంటరిగా దిగినా రెండూ ఆయనకు కుదిరేవు కాదు కాబట్టి అల్టిమేట్ గా వైసీపీ వైపు వెళ్లేందుకే రెడీ అయ్యారని టాక్ నడుస్తోంది.

ఇక ముద్రగడ చివరిసారిగా 2009లో పిఠాపురంలో పోటీ చేసి ట్రయాంగిల్ ఫైట్ లో స్వల్ప తేడాతో ఓటమి పాలు అయ్యారు. ఇపుడు కూడా పిఠాపురం సీటు మీదనే ఆయన కన్ను ఉందని అంటున్నారు. అయితే ముద్రగడ ఈ సీటులో తాను కాకుండా తన కుమారుడు గిరిబాబుని పోటీ చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అని అంటున్నారు.  ఇక వైసీపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలు చూస్తే ముద్రగడకు ఎంపీ సీటు ఆయన కుమారుడికి ఎమ్మెల్యే సీటు ఇస్తారని ప్రచారం సాగుతోంది

ముద్రగడ 1999లో కాకినాడ నుంచి ఎంపీగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. దాంతో ఆయన రెండున్నర దశాబ్దాల తరువాత మరోమారు పోటీ చేస్తారా అన్న చర్చ నడుస్తోంది. ఈ సీటులో 2019లో  వైసీపీ గెలిచింది..  ప్రస్తుతం ఈ సీట్లో వైసీపీ నుంచి ఎంపీగా వంగా గీత ఉన్నారు. 2024లో చలమలశెట్టి సునీల్ పోటీ చేస్తారు అని అంటున్నారు. ముద్రగడ బరిలోకి దిగితే మిగిలిన పేర్లు ఉండవని అంటున్నారు.

ఇక ముద్రగడ పిఠాపురం సీటు కోరుతూంటే ప్రత్తిపాడు సీటు ఇచ్చేందుకు వైసీపీ సుముఖంగా ఉందని అంటున్నారు. ఈ సీట్లో పర్వత శ్రీ పూర్ణ చంద్రప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తానే గెలుస్తాను అని ఆయన ధీమాగా ఉన్నారు. అయితే ముద్రగడ ఫ్యామిలీ వస్తే వైసీపీ ఓకే అంటుందని, గిరిబాబుకు సీటు ఖాయమని అంటున్నారు. కానీ ముద్రగడ ప్రత్తిపాడు నుంచి పోటీ చేయను అని ఒట్టేసుకున్నారని టాక్. ఒకసారి అక్కడ ఆయన ఓడిపోవడంతో ఆ సీటు వద్దని పిఠాపురమే కావాలని కోరే చాన్స్ ఉందని అంటున్నారు.

ఇక పిఠాపురంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా పెండెం దొరబాబు ఉన్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఈ సీటును జనసేనకు ఇస్తారని ప్రచారం ఉండడంతో కాకినాడ ఎంపీ వంగా గీతని నిలబెడతారు అని అంటున్నారు. మొత్తానికి ముద్రగడ కోరుకున్న పిఠాపురం సీటు విషయంలో వైసీపీ ఏమంటుందో తెలియదు. ఏది ఏమైనా ముద్రగడ కనుక వైసీపీ వైపు వస్తే కొండంత బలం కాబట్టి ఆ పార్టీ అన్ని సమీకరణలను బేరీజు వేసుకుని పెద్దాయన ఫ్యామిలీకి సీటు ఇస్తుందనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగనుందో.

Similar News