ముద్రగడకు వాంతులు.. కాపుల్లో ఆందోళన

Update: 2016-06-15 06:54 GMT
 కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష ఏడో రోజుకు చేరింది. అయితే ఈ రోజు ముద్రగడకు వాంతులు - విరేచనాలు కావడంతో వైద్యులు ఆందోళన చెందుతున్నారు. వైద్య పరీక్షలకు ముద్రగడ నిరాకరిస్తుండటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది.  ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలకు సహకరించడం లేదని - ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు చెబుతూ... ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్‌ ను విడుదల చేశారు.  ఆయన సతీమణి - కోడలికి సెలైన్‌ బాటిళ్లను ఎక్కించేందుకు ముద్రగడ అంగీకరించారని, ఆయన మాత్రం వైద్య పరీక్షలకు నిరాకరిస్తున్నారని వైద్యులు ప్రకటించారు.  రాజమండ్రి ఆసుపత్రిలోని 202 గదిలో ఉన్న ముద్రగడను కలిసేందుకు ప్రస్తుతం ఎవరినీ అనుమతించడంలేదు. ఆసుపత్రి పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండడంతో బలవంతంగా వైద్యం అందించడం కానీ.. లేదంటే ఆయన డిమాండ్లన్నిటినీ అంగీకరించి దీక్ష నుంచి విరమింపజేయడం కానీ జరగొచ్చు. ప్రస్తుతం ముద్రగడ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కొద్ది గంటల్లో ప్రభుత్వం వైపు నుంచి చర్యలు ఉండే అవకాశం ఉంది.

మరోవైపు సమస్య పరిష్కారానికి అధికారుల అధ్వర్యంలో చర్చలు మొదలయ్యాయి.  కొందరు కాపు నేతలు కూడా వైద్య పరీక్షలకు అంగీకరించాలంటూ ముద్రగడకు సూచించినా ఆయన ససేమిరా అంటున్నారు.  ప్రభుత్వం తరపున తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ - కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ముద్రగడతో చర్చలు జరిపారు. ప్రధానంగా కేసుల ఎత్తివేతతో పాటు మరి కొన్ని డిమాండ్లను ముద్రగడ తెరపైకి తీసుకొచ్చారంటున్నారు. కేసుల విషయంలో తప్ప మిగిలినన్నీ పరిష్కారయోగ్యంగానే ఉన్నాయనని తెలుస్తోంది.  ప్రధాన డిమాండ్ అయిన రిజర్వేషన్ అంశం కూడా ఈ చర్చల్లో చేరినట్టు చెబుతున్నారు. అవసరమైతే ఆగస్టులో మధ్యంతర నివేదికను ఇప్పిస్తామనే ప్రతిపాదన కూడా వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

కేసుల ఎత్తివేత విషయంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు యంత్రాం గం లేవనెత్తడంతో ప్రతిష్ఠంభన తలెత్తినట్టు తెలుస్తోంది. తాను సజీవంగా బయటకు రావాలంటే డిమాండ్లన్నీ అంగీకరించాల్సిందేనని ముద్రగడ కరాఖండిగా చెప్పినట్టు తెలిసింది. దీంతో దిశా నిర్దేశం కోసం జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదించినట్టు సమాచారం. అయితే... బుధవారం ఉదయం నుంచే ముద్రగడకు వాంతులు - విరోచనాలు మొదలవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్యలు వేగం చేసే అవకాశాలున్నాయి. కేసుల విషయంలో ఒక నిర్ణయానికి రావడమో లేదంటే ముద్రగడకు బలవంతంగా వైద్యం అందించడమో చేయొచ్చని భావిస్తున్నారు.  మరోవైపు ముద్రగడ ఆరోగ్యం క్షీణించిందని తెలియడంతో కాపుల్లో ఆందోళన ప్రారంభమైంది.
Tags:    

Similar News