ముద్రగడను వైద్యులు ఏం చేస్తున్నారు..?

Update: 2016-06-15 16:29 GMT
తుని విధ్వంసం కేసులో నిందితుల్ని అరెస్ట్ చేసిన దానికి నిరసగా కాపు నేత ముద్రగడ పద్మానభం దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన వారం రోజులుగా ఆయన దీక్ష చేయటం.. తనకు వైద్యసాయం అందించేందుకు సిద్ధమైన వైద్యుల్ని వారిస్తూ.. వారిని తన దగ్గరకు వచ్చేందుకు సైతం అనుమతించని పరిస్థితి. ఇదిలా ఉంటే బుధవారం సాయంత్రం పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓపక్క ముద్రగడకు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారన్న వార్తలు వినిపించినా? ఆయన ఒప్పుకుంటారా? లేదా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

చివరకు ఆయన తన దీక్షను విరమించినట్లుగా కొందరు చెబుతుంటే.. అసలు అలాంటిదేమీ లేదంటూ ఆయన కుమారుడు చెబుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న పరిణమాలు చూస్తే..

ముద్రగడ వైద్య పరీక్షలకు ఒప్పుకున్నారని.. ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వెల్లడించారు. ముద్రగడతో తాము.. కాపు నేతల జేఏసీ పలుమార్లు చర్చలు జరిపిన మీదట ఆయన దీక్షను విరమించి.. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమైనట్లుగా పేర్కొన్నారు. తుని ఘటనలో అరెస్ట్ అయిన 17 మంది విషయంలో వారికి బెయిల్ ఇవ్వటానికి.. వారిపై సీబీసీఐడీ విచారణ నిలిపివేయటానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. అందుకే ముద్రగడ తన దీక్షను విమరించినట్లుగా ఆకుల పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. ముద్రగడకు ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తున్నట్లుగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్.. విశాఖ రేంజ్ డీఐజీ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఐవీ ఫ్లూయిడ్స్ ను ఆయనకు బలవంతంగా ఎక్కించలేదని.. ఆయన అంగీకారంతోనే ఆయన ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ముద్రగడ కుమారుడు మాత్రం తన తండ్రి దీక్ష విరమించలేదని.. ప్రభుత్వం పదే పదే కోరటంతో తన తండ్రి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ దీక్ష విరమించారా? లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News