అట్నుంచి న‌రుక్కువ‌స్తున్న ముద్ర‌గ‌డ‌

Update: 2016-05-28 12:40 GMT
కాపునేత ముద్రగడ పద్మనాభం త‌మ కుల‌స్తుల డిమాండ్ల సాధ‌న కోసం రూటు మార్చారు. ఇన్నాళ్లు సొంతంగా ఉద్య‌మించిన ముద్ర‌గ‌డ త‌న పోరాటానికి కాపు కుల దిగ్గ‌జాలు, రాజ‌కీయ‌పార్టీల మ‌ద్ద‌తును జోడిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఏకంగా ప‌ర్య‌ట‌న‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. తాజాగా సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డిని క‌లిసి మ‌ద్ద‌తు కోరారు.

చిరంజీవి నివాసానికి వెళ్లిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఆయ‌న‌తో స‌మావేశం అయ్యారు. కాపు ఉద్య‌మం, ప్ర‌స్తుత‌ ప‌రిస్థితులు వివ‌రించారు. ముద్రగడ భేటీ అయిన సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ ప‌ద్మ‌నాభంకు ఎల్లప్పుడు త‌న మద్దతు ఉంటుందని  అన్నారు. ముద్రగడ చేపట్టిన కాపు దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళ్తే పోలీసులు రాజమండ్రి ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించారని అన్నారు. అయినా ముద్రగడ త‌నకు కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చారని అన్నారు. రిజర్వేషన్లపై ఇచ్చిన హామీని ప్రభుత్వం గడువులోగా నెరవేర్చాలని , లేదంటే ముద్రగడ భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తారని చిరంజీవి స్పష్టం చేశారు.

ఇదే క్ర‌మంలో ముద్రగడ పద్మనాభం పీసీసీ అధ్య‌క్షుడు రఘువీరాతో భేటీ అయ్యారు. తుని సభ, కాపు రిజర్వేషన్లకు మద్దతు తెలిపినందుకు ముద్రగడ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ కాపు రిజర్వేషన్‌ల సాధ‌న‌కోసం కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తోందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున కాపు రిజర్వేషన్‌ సాధన కమిటీ ఏర్పాటు చేసినట్లు, కమిటీ అధ్యక్షునిగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాజేశ్వరరావును నియమించినట్లు చెప్పారు. త‌మ పార్టీ అధినాయ‌కుల‌యిన సోనియా, రాహుల్‌ కూడా కాపు రిజర్వేషన్‌కు మద్దతు ఇచ్చారని వివరించారు.

ఇరువురు నేత‌ల‌తో భేటీ అనంత‌రం ముద్ర‌గ‌డ మీడియాతో మాట్లాడుతూ కాపు నిధికంటే మాకు రిజర్వేషన్లే ముఖ్యమని స్ప‌ష్టం చేశారు. ఇచ్చిన హామీ మేరకు ఆగస్టులోగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హామీలు నెరవేర్చకుంటే ఉద్యమం తప్పదన్నారు. త‌మ పోరాటానికి మ‌ద్ద‌తు తెలిపేందుకు చిరంజీవి, ర‌ఘువీరారెడ్డిల‌ను క‌లిసిన‌ట్లు తెలిపారు.
Tags:    

Similar News