మరి ముద్రగడ ఏమంటారో... ?

Update: 2021-10-04 09:30 GMT
ఏపీలో రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళు టైమ్ ఉన్నా కూడా ఎందుకో తొందర పడి చాలా కోయిలలు ముందే కూస్తున్నాయి. దాంతో పవర్ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కుతోంది. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ ఏపీలో టూర్ చేసి రాజకీయాలలో కొత్త సమీకరణలకు తెర లేపారు. ఆయన రాబోయే రోజుల్లో చేయబోతున్న రాజకీయం ఎలా ఉంటుందో కూడా చెప్పేసారు. సినీ పరిభాషలో చెప్పుకోవాలి అంటే ఆయన ఒక ట్రైలర్ వదిలారు అన్న మాట. దాని మీద మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఇక మీదట పవన్ చేయబోయేది అంతా కుల రాజకీయమే అన్న మాట అంటూ సెటైర్లు కూడా వేశారు.

సరే ఇంతకాలం ఎలా ఉన్నా ఇపుడు మాత్రం ఏపీలో పవన్ మాటలను సీరియస్ గానే కాపు నేతలు పట్టించుకుంటున్నారు అన్న సంకేతాలు అయితే వెలువడుతున్నాయి. కాపుల నేతగా ఉన్న మాజీ మంత్రి హరి రామ జోగయ్య వంటి వారు అయితే పవన్ కి ఈ విషయంలో దాదాపుగా రాజకీయ గురువుగా వ్యవహరిస్తున్నారు అనే చెప్పాలి. ఇపుడు ఏకంగా కాపుల ఐకాన్ అనదగిన వంగవీటి రంగా వారసుడు రాధా కూడా పవన్ కామెంట్స్ కి పూర్తి మద్దతు ఇచ్చేలా మాట్లాడుతున్నారు. మొత్తానికి జనసేనాని వేసిన పాచిక ఏపీలో పారుతుందా అంటే అవును అనే అనుకోవాలి.

సరే కాపులు ఏపీలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా కలిస్తే రాజకీయం మారుతుంది అన్నది ఎప్పటి నుంచో ఉన్న మాటే. వారు ఐక్యంగా ఈసారి అయినా ముందుకు వస్తారా అన్నది కూడా ఒక చర్చగా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే కాపులకు నిఖార్సుగా సేవ చేసిన వారు ఎవరు, కాపు జాతి కోసం ఉద్యమ బాట పట్టిన వారు ఎవరూ అంటే మాత్రం మొదటిగా చెప్పుకోవాల్సింది వంగవీటి మోహన రంగా గురించే. ఆయన కేవలం కాపుల కోసమే కూడా ఉద్యమించలేదు, ఆయన పేదల కోసం పనిచేశారు. ఆ విధంగా ఒక సారి కార్పోరేటర్ గా గెలిచారు. మరోసారికి ఎమ్మెల్యే అయ్యారు. ఇంకా ఎంతో భవిష్యత్తు ఉందనుకుంటున్న టైమ్ లో ఆయన దారుణంగా హత్యకు గురి అయ్యారు. ఆయన హత్య తరువాతనే  కాపులు బాగా చైతన్యమై మరింత సంఘటితం అయ్యారనే చెప్పుకోవాలి.

ఇక రంగా తరువాత కాపుల కోసం ఆ స్థాయిలో పోరాటం చేసింది మాత్రం ముద్రగడ పద్మనాభమే అని కూడా చెప్పాలి. ముద్రగడ పోరాటం కాపుల అస్తిత్వం గురించి మాత్రమే కాదు, వారి జీవన ప్రమాణాలు మెరుగు కావాలని కూడా తపించారు. ఆయన రాజకీయ, ఆర్ధిక, సామాజిక అంశాల మీద ఉద్యమించారు. అలాంటి ముద్రగడ 1990 దశకం నుంచి పోరాడుతూనే ఉన్నారు. దాని కోసం ఆయన తన రాజకీయ జీవితాన్ని కూడా త్యాగం చేశారు. నిజానికి అందరిలాగానే ఉంటే ఆయన కూడా ఈపాటికి ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి స్థాయిలలో కూడా వెలిగేవారేమో. కానీ ఆయన కాపుల అభ్యున్నతినే తన‌ అజెండాగా చేసుకున్నారు. అయితే ఆయనకు లభించిన మద్దతు ఎంత అన్నది ఇక్కడ చూడాలి. కాపుల కోసం ఏకంగా తన జీవితాన్నే అర్పించిన ముద్రగడ వంటి వారి కంటే కూడా గొప్ప వారు కూడా ఎవరూ లేరు అని కూడా అంటారు అంతా.

కాపులను బీసీలలో చేర్చాలని ఆయన అతి పెద్ద ఉద్యమం నడిపారు. ఆ సమయంలో ఆయనకు ఇపుడు పెద్ద మాటలు మాటలు మాట్లాడుతున్న వారి మద్దతు ఎంతవరకూ దక్కింది అన్నది కూడా ఆలోచన చేయాలి అన్న మాట కూడా ఉంది. ఇక కాపుల కోసం పనిచేసిన ముద్రగడకు ఏ రకమైన సినీ చరిష్మా లేదు, ఆయన కేవలం తమ చిత్తశుద్ధి, నిజాయతీని నమ్ముకునే కులం కోసం గొంతెత్తారు. చివరికి ఆయన విసిగి ఇపుడు మౌన ముద్ర దాల్చారు. మరి ఈ సమయంలో కాపుల ఐక్యత గురించి మాట్లాడుతున్న టైమ్ లో ముద్రగడ ఎలా రియాక్ట్ అవుతారు అన్న చర్చ కూడా ఉంది. ముద్రగడ దాదాపుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే ఆయన కాపు ఉద్యమానికి కూడా దూరంగా ఉంటున్నారు.

మరి ముద్రగడ వంటి వారు కనుక ముందుకు వస్తే కాపులు నిజంగా ఏపీ రాజకీయాల్లో ఒక ఫోర్స్ గా ఉంటారని అంతా అంటున్నారు. ముద్రగడ కీలకంగా మారుతున్న వేళ ఆయన మళ్లీ చురుకుగా ఉంటారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మొత్తానికి ముద్రగడను తమ వైపు తిప్పుకోవాలని కూడా అనేక పార్టీలు ఇంతవరకూ ప్రయత్నించాయి. ఆయన ఎటూ టీడీపీకి మద్దతు ఇవ్వరని అంటారు. ఇక బీజేపీ, వైసీపీ వంటివి ఆయనతో అప్పట్లో చర్చలు జరిపాయని కూడా ప్రచారం అయితే సాగింది. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో కాపులు కీలక పాత్ర పోషిస్తారు అన్న అంశం అయితే గట్టిగా అంది. దాంతో పాటే అందరి చూపూ ముద్రగడ వైపు ఉంది. ఆయన వేసే అడుగులే రేపటి ఏపీ రాజకీయాన్ని నిర్దేశిస్తాయన్నది కూడా వాస్తవం అంటున్నారు.
Tags:    

Similar News