వైకాపా నుంచి రాజ్యసభకు ముద్రగడ ?

Update: 2016-03-04 06:44 GMT
త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రెడీ అవుతోంది. సంఖ్యాపరంగా ఒక రాజ్యసభ సీటు ఖచ్చితంగా సాధించే అవకాశం ఉన్నప్పటికీ రెండవ అభ్యర్థిని కూడా బరిలోకి దింపాలని జగన్మోహన్‌ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. మొన్నటిదాకా రాజ్యసభ బరిలో పార్టీ సీనియర్‌ నేత, వైఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డిని దింపాలని జగన్‌ అనుకున్నారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో మాజీమంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మ నాభంను రాజ్యసభకు ఎంపిక చేసి రెండవ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి లేదా సినీ దర్శకుడు - నిర్మాత దాసరి నారాయణరావును పోటీకి పెట్టాలన్న యోచనలో జగన్‌ ఉన్నట్టు వైకాపాలో ప్రచారం జరుగుతోంది.

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కాపు సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకుని తద్వారా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు జగన్‌ వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడను రాజ్యసభకు పంపించి కాపులకు వైకాపాను దగ్గర చేయాలని చూస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

కాపులను బీసీల్లో చేర్చాలని ముద్రగడ కాపు గర్జనను ప్రారంభించ డానికి ముందు రాజ్యసభ అభ్యర్థులుగా దాసరి నారాయణ రావు - విజయసాయిరెడ్డిలను ఎంపిక చేయాలని జగన్‌ అనుకున్నారు. దాసరి నారాయణరావును మర్యాద పూర్వకంగా కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్ళిన జగన్‌ రాజ్యసభ అభ్యర్థిత్వంపై ఆయనకు తన మనసులోని మాటను చెప్పారని కూడా అంటారు. అయితే... తుని గర్జన తర్వాత దాసరి పేరును పక్కనబెట్టి ముద్రగడ పద్మనాభం అభ్యర్థిత్వాన్ని తెరపైకి తెచ్చినట్టు ఆ పార్టీకి చెందిన కొందరు ముఖ్యనేతలు చెబుతున్నారు.
Tags:    

Similar News