వైసీపీలోకి ముద్ర‌గ‌డ నిజ‌మెంత‌?

Update: 2022-09-05 11:38 GMT
కాపు రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి నాయ‌కుడు ముద్ర‌గడ ప‌ద్మనాభం కుటుంబం వైసీపీలో చేరుతోంద‌నే గాసిప్స్ వినిపిస్తున్నాయి. తూర్పు గోదావ‌రి జిల్లా కిర్లంపూడికి చెందిన ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం గ‌తంలో ఐదుసార్లు శాస‌న‌స‌భ‌కు, ఒక‌సారి కాకినాడ ఎంపీ ప‌ద‌వికి ఎన్నిక‌య్యారు. కాంగ్రెస్, టీడీపీల త‌ర‌ఫున గెలుపొందారు.

కాగా గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో కాపుల రిజ‌ర్వేష‌న్ల‌కు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం చేప‌ట్టిన ఆందోళ‌న తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారితీసిన సంగ‌తి తెలిసిందే. తుని వ‌ద్ద విజ‌య‌వాడ నుంచి విశాఖ‌ప‌ట్నం వెళ్తున్న ర‌త్నాచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌కు గుర్తు తెలియ‌ని దుండ‌గులు నిప్పు పెట్టారు. దీంతో టీడీపీ ప్ర‌భుత్వం భారీ ఎత్తున పోలీసుల‌ను మోహ‌రించి కాపు ఉద్య‌మాన్ని అణ‌చివేసింద‌నే విమ‌ర్శలు ఉన్నాయి. అంతేకాకుండా ముద్ర‌గ‌డ‌తోపాటు ఆయ‌న స‌తీమ‌ణి, కుమారుడు, కోడ‌ల్ని లాఠీల‌తో కొట్ట‌డంతోపాటు పోలీసులు బూతులు తిట్టార‌ని స్వ‌యంగా ముద్ర‌గ‌డ ఆరోపించ‌డం క‌ల‌క‌లం రేపింది.

అయితే విచిత్రంగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వ‌చ్చాక ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కాపు ఉద్య‌మానికి స్వ‌స్తి ప‌లికారు. త‌న చిత్త‌శుద్ధిని శంకిస్తూ కొన్ని కాపు సంఘాలు ఆరోప‌ణ‌లు చేస్తున్నాయ‌ని, ఇప్ప‌టివ‌ర‌కు తాను అనుభ‌వించిన బాధ‌లు, అవ‌మానాలు చాల‌ని ఆయ‌న కాపు రిజ‌ర్వేష‌న్ ఉద్య‌మాన్ని విడిచిపెట్టేశారు. అప్ప‌టి నుంచి ఖాళీగానే ఉంటూ వ‌స్తున్నారు. అప్పుడప్పుడు వివిధ అంశాల‌పై సీఎం జ‌గ‌న్‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా లేఖ‌లు రాయ‌డం చేస్తూ వ‌చ్చారు.

ఈ ప‌రిస్థితుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంకా అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర స‌మ‌యం మాత్ర‌మే ఉన్న నేప‌థ్యంలో ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కుటుంబాన్ని వైసీపీలోకి తీసుకొచ్చే ప‌నులు వేగ‌వంత‌మ‌య్యాయ‌ని అంటున్నారు.

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం చేర‌క‌పోయినా ఆయ‌న కుమారుడు గిరిబాబు చేర‌తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ దిశ‌గా ఇప్ప‌టికే గిరిబాబుతో వైసీపీ అధిష్టానం దూతలు చ‌ర్చ‌లు కూడా పూర్తి చేశార‌ని స‌మాచారం.

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కుటుంబాన్ని పార్టీలో చేర్చుకుంటే తూర్పుగోదావ‌రి జిల్లాలో ఉన్న 19 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌తోపాటు మూడు పార్ల‌మెంటు స్థానాల్లో ఘ‌న విజ‌యం సాధించ‌వ‌చ్చ‌నేది వైసీపీ ప్లాన్ అని అంటున్నారు. అలాగే మిగ‌తా జిల్లాల్లోనూ కాపుల ఓట్ల‌ను ఆక‌ర్షించ‌వ‌చ్చ‌ని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News