ముద్ర‌గ‌డ‌... క్రేజీ డిమాండ్ షాకింగ్‌

Update: 2018-06-11 12:36 GMT
కాపు ఉద్య‌మ‌నేత‌ - మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీద‌కు తీసుకువ‌చ్చారు. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు విధానాల‌ను విమ‌ర్శిస్తున్న ముద్ర‌గ‌డ తాజాగా ఆయ‌న తీరుపై స్పందించారు. అదే రీతిలో కొత్త ప్ర‌తిపాద‌న‌ను ముందుకు తీసుకువ‌చ్చారు. ప్రతిపక్ష నేతలకు ముద్రగడ సోమవారం ఒక లేఖ రాశారు. ప్రజల ఆస్తులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సొంత ఆస్తులుగా భావించి...సింగపూర్‌ కంపెనీలకు దానం చేస్తున్నారని ఈ లేఖ‌లో ఆరోపించారు.  రాష్ట్రాన్ని సింగపూర్‌ పాలిత ప్రాంతంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అందరూ కలిసి రాష్ట్రాన్ని - రైతులను - సామాన్య ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరముందని ముద్రగడ అన్నారు.

ఎందరో త్యాగాలు ఫలితంగా దేశంలో విదేశీ పాలన పోయిందని.. కానీ ఏపీని  సింగపూర్ పాలిత ప్రాంతంగా చేయడానికి చంద్రబాబునాయుడు తహతహలాడుతున్నారని ముద్ర‌గ‌డ‌ విమర్శించారు. అమరావతి భూములను సింగపూర్ కంపెనీలకు ఇస్తామని ప్రకటించిన జూన్ 7 ఏపీకి చీకటి రోజని ఆ లేఖలో పేర్కొన్నారు. `చంద్రబాబు తన తండ్రి - తాతల ఆస్తులు అయినట్టు భావించి రైతుల భూములను దానం చేస్తున్నారు. ఈ విధంగా ఈ భూములను ధారాదత్తం చేసిన జూన్ 7ను చరిత్రలో చీకటి రోజుగా భావించాలి. ఎన్నో పోరాటాలు - ప్రాణత్యాగాలు చేసి పరాయి పాలన నుంచి విముక్తి పొందాం. ఇప్పుడు సింగపూర్ పాలన నుంచి బయటపడేందుకు మరోసారి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. బ్రిటీష్ వారిని మన దేశం నుండి ఎలా తరిమికొట్టామో.. అదేవిధంగా సింగపూర్ కంపెనీని తరిమి కొట్టాలి’  అని ముద్ర‌గ‌డ పేర్కొన్నారు.టీడీపీ ప్రభుత్వ విధానాలపై పోరాటానికి జగన్‌ - పవన్‌ కల్యాణ్‌ సహా అన్ని పార్టీల నేతలూ ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందని  అన్నారు.

చంద్రబాబు పాలనా విధానాలపై యుద్ధభూమిలో తేల్చుకోవడానికి వైసీపీ అధినేత జగన్‌ - జనసేన అధినేత పవన్‌ లు ప్రణాళిక రూపొందించాలని ముద్రగడ అభిప్రాయపడ్డారు. వారిద్దరూ యాత్రలకు కొంత విరామ ప్రకటించి ఈ దిశగా ఆలోచించాలని కోరారు. ప్రజల కోసం నిరంతరం పోరాడే కమ్యూనిస్టులను కలుపుకుని చంద్రబాబుపై పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ముద్ర‌గ‌డ తాజా ప్ర‌తిపాద‌న రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయినా... పార్టీ నిర్మాణమే చేత‌కాని ప‌వ‌న్‌ తో జ‌గ‌న్ క‌ల‌వ‌డం ఏంటి? ముద్ర‌గ‌డ కు విశేష ప్ర‌జాద‌ర‌ణ ఉన్న‌ జ‌గ‌న్ కే స‌ల‌హా ఇచ్చేటంత స్థాయి లేద‌ని వైసీపీ అభిమానులు మండిప‌డుతున్నారు.
Tags:    

Similar News