తెలంగాణ సచివాలయానికి సారు ముహుర్తం సిద్దం?

Update: 2020-08-07 13:30 GMT
తాను అనుకున్నది అనుకున్నట్లు జరిగేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతలా కష్టపడతారో తెలియంది కాదు. వాస్తు లెక్కలు కుదరకపోవటం కావొచ్చు.. సదుపాయాల లేమి కావొచ్చు.. తాను వద్దనుకున్న సచివాలయాన్ని తాను అనుకున్నట్లే నేలమట్టం చేయించిన ఆయన.. కొత్త సచివాలయానికి సంబంధించి భారీ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన కొన్ని రోజులుగా కొత్త సచివాలయ డిజైన్ల మీద కుస్తీ పడటం.. ఒక కొలిక్కి తీసుకురావటం తెలిసిందే. ఓవైపు డిజైన్లకు సంబంధించి లెక్కల్ని చూసుకుంటూనే.. మరోవైపు వాయు వేగంతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేసే అంశంపైనా చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా కొత్త సచివాలయ నిర్మానానికి భూమిపూజ కోసం ముహుర్తాన్ని ఫిక్స్ చేసినట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో దసరా సెంటిమెంట్ ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఆ రోజున ఏ పని చేసినా విజయవంతంగా పూర్తి అవుతుందన్న నమ్మకం ఉంది. సారు మెచ్చిన ముహుర్తం కూడా అదేనన్న మాట వినిపిస్తోంది. దసరా రోజున పనులు మొదలు పెట్టి.. మళ్లీ వచ్చే దసరా నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించినట్లుగా చెబుతున్నారు.

దాదాపు ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏడంతస్తుల భవనాన్ని నిర్మించటం.. అందుకు సంబంధించి పూర్తిస్థాయి ఏర్పాటు చేయటం ఏడాదిలో కష్టమేనని చెబుతున్నారు. అయినప్పటికీ సారు నిర్దేశించిన లక్ష్యం మాత్రం ఏడాదిగానే చెబుతున్నారు. పక్కాగా ఏడాదిలో పూర్తి చేయాలన్నదే మనసులో పెట్టుకోవాలని.. అందుకు ఒకట్రెండు నెలలు అటుఇటు అయినా ఫర్లేదన్న మాట చెప్పినా.. దాన్నో అవకాశంగా తీసుకొని పనులు ఆలస్యం చేయొద్దన్న మాట సీరియస్ గా చెప్పినట్లుగా తెలుస్తోంది.

భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతుల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని.. ఇప్పటికి ఏ నిర్మాణ సంస్థకు దీన్ని అప్పజెప్పాలన్న విషయంపై క్లారిటీ రానప్పటికీ.. బ్యాక్ ఎండ్ వర్కు మాత్రం జోరుగా సాగుతుందని చెబుతున్నారు. కొత్త సచివాలయానికి సంబంధించిన అనుమతులు వచ్చే నాటికి టెండర్లు ఖరారు చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా చెబుతున్నారు. మిగిలిన ఫైళ్ల సంగతి ఎలా ఉన్నా.. సచివాలయ ఫైలు మాత్రం ఎక్కడా ఆగకూడదని.. యుద్ధ ప్రాతిపదికన మీద ఉరుకులు పరుగులు తీయాలన్న మాట అధికారిక వినిపిస్తున్నట్లు చెబుతున్నారు. సారుకు ఎంతో ఇష్టమైన దసరా రోజున.. తన కలల పంటైన కొత్త సచివాలయ నిర్మాణానికి భూమిపూజ చేయటానికి సుముఖంగా ఉన్నట్ల చెబుతున్నారు.
Tags:    

Similar News