అఖిలేష్ ను ములాయం గిల్లుతూనే జోకొట్టారుగా

Update: 2017-09-25 10:54 GMT
యూపీ మాజీ సీఎం - స‌మాజ్ వాదీ పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ములాయం సింగ్ యాద‌వ్ త‌న కుమారుడు - మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ విష‌యంలో గిల్లి జోల‌పాడిన‌ట్టు మాట్లాడారు. పార్టీని త‌న చేతుల్లోంచి కొడుకు తీసేసుకోవ‌డంపై ఇంకా ఆయ‌న‌లో కోపం ఎక్క‌డా పోలేదు. దీనికితోడు యూపీలో తిరిగి అధికారంలోకి తీసుకురాలేక‌పోయాడ‌న్న ఆవేద‌న కూడా ఆయ‌న‌లో పోలేదు. ప్ర‌స్తుతం ఎంపీగా ఉన్న ములాయం.. త‌న‌కు కొత్త పార్టీ పెట్టే ఉద్దేశం ఏమీ లేద‌ని మాత్రం చెబుతూనే.. భ‌విష్య‌త్తులో ఎమైనా జ‌ర‌గొచ్చు అంటూ న‌ర్మ‌గ‌ర్భంగా ప్ర‌క‌టించి సంచ‌ల‌నానికి తెర‌దీశాడు.  `నేనిప్పుడు కొత్త పార్టీ పెట్టడం లేదు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకటనలు చేస్తాన’ని చెప్పారు.

అదేస‌మ‌యంలో.. అఖిలేష్‌ యాదవ్‌ కు తన ఆశీస్సులు ఉంటాయని, అయితే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నానని చెప్పి అంద‌రికీ ఖంగు తినిపించారు.  అయితే, తాను తీసుకోబోయే  నిర్ణయాలు ఏమిటనేది రాబోయే రోజుల్లో వెల్లడిస్తానని చెప్పారు. కేంద్రం - ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ విఫలమయ్యాయని ములాయం విమర్శించారు. ‘కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా హామీలు అమలు చేయలేదు. పెట్రోలు-డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటాయి. బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో బాలికలకు రక్షణ లేకుండా పోయింది. ఉత్తరప్రదేశ్‌ లో శాంతిభద్రతలు క్షీణించాయి. రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. యోగి పాలనలో అన్నదాతలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నార’ని ములాయం మండిపడ్డారు.

బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ములాయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారనగానే ఆయన కొత్త పార్టీ ప్రకటిస్తారని అంతకుముందు ప్రచారం జరిగింది. సొంత పార్టీలో చేదు అనుభవాలు ఎదురైన నేపథ్యంలో ‘పెద్దాయన’  వేరు కుంపటి పెడతారని వార్తలు వచ్చాయి. ములాయం తాజా ప్రకటనతో ఊహాగానాలకు తెరపడింది. అయితే, ఆ వెన‌కాలే  భ‌విష్య‌త్తులో ఏమైనా ప్ర‌క‌ట‌న‌లు చేయొచ్చు అంటూ ఆయ‌న బాంబు పేల్చ‌డం కూడా ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగానే మారింది. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News