మ‌హారాష్ట్ర మొత్తం గంద‌ర‌గోళంలో ప‌డిపోయింది

Update: 2018-06-25 07:43 GMT
ఔను. ఒక్క‌రు కాదు ఇద్ద‌రు కాదు...మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లంతా ఏం తోచ‌ని స్థితికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున గంద‌ర‌గోళప‌డుతున్నారు. ఇందుకు కార‌ణంగా మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం నుంచి ప్లాస్టిక్ వాడకంపై నిషేధాన్ని అమలు చేస్తుండ‌టం. రిటైలర్లు - అమ్మకందారులకు నిషేధపు సెగ తగులుతోంది. వారాంతపు సంతలు - కూరగాయల కొట్ల నుంచి ముంబైలోని యాప్ ఆధారిత ఫుడ్ డెలివరీ యూనిట్ల వరకు నిషేధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఫుడ్ యాప్స్ ప్రధానంగా తమ ఆర్డర్లను ప్లాస్టిక్ కవర్లలోనే హోండెలివరీ చేస్తుంటాయి. ఇప్పుటికప్పుడు వీటి ప్రత్యామ్నాయం ఎలా అన్నది ఆ రంగాన్ని తీవ్రంగా వేధిస్తున్న ప్రశ్న.

రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్‌పై నిషేధాన్ని మహారాష్ట్ర శనివారం నుంచి అమల్లోకి తెచ్చింది. ప్లాస్టిక్‌ పై నిషేధం ఆదివారం నుంచి మహారాష్ట్రలో అమల్లోకి రాగా - తొలిరోజే నాసిక్‌ లో రూ.3.6 లక్షల జరిమానా వసూలు చేశారు అధికారులు. నిషేధాన్ని అతిక్రమించిన 72 మందిని పట్టుకుని ఈ జరిమానా వసూలు చేసినట్లు నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మీడియాకు వెల్లడించారు. 72 మంది నుంచి 350 కిలోల ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మరోవైపు ప్లాస్టిక్ వాడుతున్న బాంద్రాలోని మెక్‌ డోనాల్డ్ - స్టార్‌ బక్స్‌ తోపాటు మరో ఫుడ్ ఔట్‌ లెట్‌ కు  రూ.5వేల చొప్పున అధికారులు ఫైన్ వేశారు. అలాగే థానేలో వందమంది నుంచి రూ.95వేలు, నవీ ముంబైలో రూ.35వేలు జరిమానాగా వసూలు చేశారు. పెద్ద ఎత్తున ప్లాస్టిక్‌ ను సీజ్ చేశారు. అయితే ప్రజలు ఇంకా సన్నద్ధంకానందున సోమవారం వరకు వినియోగదారులపై ఎలాంటి జరిమానాలు విధించబోమని ముంబై మున్సిపల్ అధికారులు స్పష్టంచేశారు. కాగా, నిషేధిత జాబితాలో క్యారీ బ్యాగులు - పెట్ బాటిళ్ల నుంచి ప్యాకేజింగ్ మెటీరియల్ - థర్మకోల్ వరకు అనేకరకాల ప్లాస్టిక్ ఉత్పత్తులు  ఉన్నాయి. ఈ నిర్ణ యంతో ప్రభుత్వానికి ఏటా రూ.15వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. ప్లాస్టిక్ పరిశ్రమలపై ఆధారపడి మూడు లక్షలమంది జీవనం సాగిస్తుండగా, తాజా నిషేధంతో వీరంతా రోడ్డున పడనున్నారు. నిషేధం కారణంగా ఉద్యోగాలు ఊడటంతోపాటు రాష్ట్ర జీడీపీపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. ప్లాస్టిక్ రంగంలో బ్యాంకు రుణాలు వసూలు కాకుండాపోతాయి అని ప్లాస్టిక్‌ బ్యాగ్స్ ఉత్పత్తి దారుల సంఘం ప్రధాన కార్యదర్శి నీమిత్ పునమియా తెలిపారు.

ఏటా ప్రపంచవ్యాప్తంగా 50వేల కోట్ల ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం జరుగుతుండగా, ప్రతి నిమిషం ఒక లారీ నిండా ప్లాస్టిక్ చెత్త తయారవుతోంది. మన దేశంలో ఏటా 56లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు తయారవుతున్నాయంటే ప్లాస్టిక్ భూతం ఏ స్థాయిలో పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నదో అర్థంచేసుకోవచ్చు. ప్లాస్టిక్ వ్యర్థాలు - ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ తో పెనుముప్పు వాటిల్లుతున్నది. ప్లాస్టిక్‌ ను అదుపు చేసేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కేవలం నిషేధం వంటి కఠినతరమైన నిర్ణయాలతో ప్లాస్టిక్‌ ను రూపుమాపటం సాధ్యమవుతుందా అంటే పూర్తిస్థాయిలో కాదనే చెప్పొచ్చు. ప్లాస్టిక్ స్థానంలో ప్రత్యామ్నాయంగా ఉపయోగించే క్లాత్ - జూట్ - పేపర్ సంచులను - కవర్లు వాడే విధంగా చైతన్యవంతుల్ని చేయడంతోపాటు ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తేవడం ద్వారా కొంతమేర ఫలితం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే ప్లాస్టిక్ ప్లేట్లు - ప్లాస్టిక్ గ్లాసుల స్థానంలో పేపర్ ప్లేట్లు - పేపర్ గ్లాసులను అతితక్కువ ధరకు లభ్యమయ్యేలా చొరవ తీసుకుంటే ప్లాస్టిక్ వినియోగం తగ్గుతుంది.

Tags:    

Similar News