శ‌భాష్ ముంబై.. అన్న‌దాత‌లు మీకు శాల్యూట్‌!

Update: 2018-03-12 13:11 GMT
చ‌రిత్ర‌లో నిలిచిపోయే నిర‌స‌న‌ను మ‌హారాష్ట్ర అన్న‌దాత‌లు నిర్వ‌హించారు. నిర‌స‌న‌ల ప‌ర్వానికి స‌రికొత్త స్ఫూర్తిగా నిలిచే ఈ ఉదంతం గురించి అంద‌రూ తెలుసుకోవాల్సిన విష‌యాలెన్నో.  రైతు రుణాల మాఫీ.. పంట‌కు గిట్టుబాటు ధ‌ర‌ల‌తో పాటు.. తాము పండించే పంట‌ను ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేయాల‌ని.. ఇత‌ర‌త్రా డిమాండ్స్ తో ఐదు రోజుల క్రితం మ‌హారాష్ట్రలోని నాసిక్ నుంచి బ‌య‌లుదేరి 35 వేల మంది రైతులు ముంబ‌యికి చేరుకోవ‌టం తెలిసిందే.

ఐదు రోజుల పాటు 180 కిలోమీట‌ర్లు న‌డిచిన వేలాది మంది రైతులు రాష్ట్ర రాజ‌ధానికి చేరుకున్నంత‌నే వారిలో భావోద్వేగం ఎలా ఉంటుంది? అన్ని వేల మంది న్యాయ‌మైన డిమాండ్ల సాధ‌న కోసం రాజధానికి వ‌చ్చిన నేప‌థ్యంలో వారిలో ఆవేశం అంతోఇంతో మామూలే. అయితే.. అందుకు భిన్నంగా రైతులు వ్య‌వ‌హ‌రించ‌టం ఒక ఎత్తు అయితే.. న్యాయ‌మైన డిమాండ్ల‌తో రాజ‌ధానికి వ‌చ్చిన వేలాది మందికి ముంబ‌యి న‌గ‌ర వాసులు ప్ర‌ద‌ర్శించిన పెద్ద మ‌న‌సు అపూర్వం. అంతేనా.. సోమ‌వారం ఉద‌యం బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయ‌ని.. త‌మ రాక కార‌ణంగా పొద్దున్నే న‌గ‌రానికి చేరుకుంటే ట్రాఫిక్ జాం అవుతుంద‌న్న ఆలోచ‌న‌.. త‌మ కార‌ణంగా పిల్ల‌లు అస్స‌లు ఇబ్బంది ప‌డ‌కూడ‌దంటూ వారో అనూహ్య‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు.

నిన్న రాత్రి (ఆదివారం) విశ్ర‌మించ‌కుండా.. అడుగులో అడుగు వేసుకుంటూ అర్థ‌రాత్రి ముంబ‌యి మ‌హాన‌గ‌రానికి చేరుకున్నారు. అంతేనా.. అర్థ‌రాత్రి వేళ‌లోనే అజాద్ మైదానానికి చేరుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఐదురోజుల  సుదీర్ఘ కాలిన‌డ‌క త‌ర్వాత న‌గ‌రానికి చేరుకున్న అన్న‌దాత‌ల్ని న‌గ‌ర‌వాసులు అప్యాయంగా స్వాగ‌తం పలికారు. ఆత్మీయంగా చూసుకున్నారు. వారికి మంచినీరు.. ఆహారపు పొట్లాలు.. బిస్కెట్ పాకెట్లు పంచి త‌మ స‌హృద‌య‌త చాటుకున్నారు.

స్వ‌చ్ఛంద సంస్థ‌లు మొద‌లుకొని.. రాజ‌కీయ పార్టీల వ‌ర‌కూ అన్న‌దాత‌ల‌కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేసే ప్ర‌య‌త్నం చేశారు. ప‌లువురు కాల‌నీ వాసులు సైతం కూడ‌ళ్ల వ‌ద్ద వారికి ఆహారాన్ని.. మంచినీటిని అందించారు.  అజాద్ మైదానంలో వారు కాల‌కృత్యాలు తీర్చుకునేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేశారు. ట్యాంక‌ర్ల‌తో నీరు.. మొబైల్ టాయిలెట్లు.. అంబులెన్స్ లు సిద్ధం చేశారు.  

వామ‌ప‌క్ష అనుబంధ సంస్థ అయిన అఖిల భార‌త కిసాన్ స‌భ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ ర్యాలీ కొత్త స్ఫూర్తిని ర‌గిలించింది. ఎర్ర జెండాల‌తో వేలాది మంది రోడ్ల మీద వ‌రుస పెట్ట‌టం.. క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా నిల‌వ‌టంతో మ‌హాన‌గ‌రం మొత్తం ఎర్ర‌జెండాల‌తో కొత్త శోభ‌ను సంత‌రించుకున్న‌ట్లైంది. త‌మ నిర‌స‌న‌లో భాగంగా ముంబ‌యి న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఎలాంటి అసౌక‌ర్యానికి గురి చేయ‌మ‌న్న అన్న‌దాత‌లు.. త‌మ మాట‌కు త‌గ్గ‌ట్లే హుందాగా నిల‌వ‌టం.. రైతు ర్యాలీలో కొంద‌రు కుటుంబాల‌తో స‌హా ముంబ‌యి న‌గ‌రానికి చేరుకోవ‌టం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

క‌ష్టంగా మారిన వ్య‌వ‌సాయంపై త‌మ డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తెచ్చేందుకు అన్న‌దాత‌లు జ‌రిపిన మ‌హార్యాలీపై బాలీవుడ్ స్పందించింది. న‌గ‌ర‌వాసుల‌కు.. బోర్డు ప‌రీక్ష‌లు జ‌రుగుతున్న వేళ‌.. విద్యార్థుల‌కు ఏ మాత్రం అసౌక‌ర్యం క‌లిగించ‌కుండా ఉండేందుకు రైతులు తీసుకున్న‌నిర్ణ‌యం త‌మ‌లో స్ఫూర్తిని నింపింద‌ని.. బాలీవుడ్ న‌టులు ప‌లువురు పేర్కొన్నారు. రైతుల‌కు స‌లాం అంటూ ట్వీట్లు చేశారు. అన్న‌దాత‌ల‌కు బాస‌ట‌గా నిలిచిన సినీ ప్ర‌ముఖుల్లో రితీష్ దేశ్ ముఖ్‌.. దియామీర్జా.. ఒనీర్.. ప్ర‌కాశ్ రాజ్.. మాధ‌వ‌న్.. పూరీ జ‌గ‌న్నాధ్‌.. సిద్ధార్థ బ‌సు.. శ్రుతిసేథ్‌.. ప్రితీష్ నంది.. లాంటి ఎంతోమంది సెల‌బ్రిటీలు రైతుల‌కు సంఘీభావంగా నిలిచారు. రైతుల‌కు త‌మ శాల్యూట్ అంటూ నిన‌దించారు. నిజంగానే.. జైకిసాన్ అన‌టంతో స‌రిపోదు.. అంతే గ‌ట్టిగా ముంబ‌యి వాసుల్ని అభినందించాల్సిందే.
Tags:    

Similar News