కేటీఆర్ మ‌రిచిపోయిన 'మునుగోడు'.. ఎందుకంటే!

Update: 2023-01-11 09:01 GMT
"మునుగోడులో టీఆర్ ఎస్ అభ్య‌ర్థిని గెలిపిస్తే.. ఆ మ‌రుక్ష‌ణం నుంచి దీనిని బాగు చేసే బాధ్య‌త‌ను నేను తీసుకుంటా. నేనే ఎమ్మెల్యేగా మారి.. ఇక్క‌డ మీకు అభివృద్ధి ఫ‌లాల‌ను అందిస్తాను"- ఇదీ..గ‌త ఏడాది న‌వంబ‌రు 3న జ‌రిగిన ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు నియోజ‌క‌వర్గం ఉప ఎన్నిక స‌మ‌యంలో మంత్రి కేటీఆర్ ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీ.. ఎన్నిక‌ల ప్ర‌ణాళిక మేర‌కు ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌.

అయితే.. ఎన్నిక‌లు అయిపోయి, మునుగోడు ఫ‌లితం వ‌చ్చేసి.. ఈ నెల 6వ తేదీకి రెండు మాసాలు పూర్తిగా గ‌డిచిపోయాయి. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ కేటీఆర్ ప‌ర్య‌టించిన పాపాన పోలేద‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు గుస‌గుస లాడుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు.. ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని ద‌త్త‌త తీసుకుని.. త‌న నియోజ‌క‌వ‌ర్గం సిర్సిల్లా మాదిరిగా.. తీర్చిదిద్దుతాన‌ని.. తాగునీటి స‌మ‌స్య‌ను పూర్తిగా ప‌రిష్క‌రిస్తాన‌ని... కూడా కేటీఆర్ చెప్పారు.

అదేస‌మ‌యంలో పోడు వ్య‌వ‌సాయం.. ఎస్టీల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని చెప్పారు. మ‌రి కేటీఆర్‌ మాట‌ల‌పై న‌మ్మ‌కం ఉంచిన ఇక్క‌డి ప్ర‌జ‌లు త్రిముఖ పోటీలో కూడా.. టీఆర్ ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డిని గెలిపించారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఎమ్మెల్యే కూసుకుంట్ల ఒక్క‌సారి మాత్ర‌మే ఇక్క‌డ ప‌ర్య‌టించారు. ఇక‌, ఎన్నో హామీలు ఇచ్చిన కేటీఆర్ మాత్రం ఇక్క‌డ క‌నిపించ‌డం మానేశారు.

ఈ చ‌ర్చ ఎందుకు తెర‌మీదికి వ‌చ్చిందంటే.. మ‌రో ఆరు మాసాల్లో తెలంగాణ ఎన్నిక‌లకు రంగం రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ ఇచ్చిన హామీ నెర‌వేర్చ‌క‌పోతే.. ఇక్క‌డి ప్ర‌జ‌లు వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేయ‌రా? అనేది సందేహం. ఈ నేప‌థ్యంలో ఎంతో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. మునుగోడు విష‌యంపై తాను ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌ని కేటీఆర్ కు ఇక్క‌డి ప్ర‌జ‌లు విన్న‌విస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News