గుచ్చుతున్న కులం బాణం : అంతటి ఇళయరాజా అంతేనా...?

Update: 2022-07-07 15:10 GMT
ఆయన ఒక గొప్ప సంగీత స్ర‌ష్ట.  ఒక విధంగా చెప్పాలీ అంటే ఆధునిక సంగీతానికి ప్రాచీన మేళవింపులు సమకూర్చి  శృతిపక్వంగా సినీ  గీతాన్ని అందించే ఒక గొప్ప జ్ఞాని. ఆయన ప్రతిభకు ఆకాశమే హద్దు. దేశం గర్వించే సినీ  సంగీత దర్శకుడు ఆయన. అలాంటి ఇళయరాజాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి కోటా కింద రాజ్యసభకు నామినేట్ చేసింది.

ఇది భారతీయులకు ప్రత్యేకించి ఆయన సంగీతాన్ని దశాబ్దాలుగా ఆస్వాదిస్తున్న వారందరికీ  పండుగగా మారింది. అయితే ఇళయరాజాకు రాజ్యసభ నామినేషన్ దక్కడం పట్ల బీహార్ కి చెందిన బీజేపీ దళిత నాయకుడు గురు ప్రకాష్ పాశ్వాన్ అయితే ప్రశంసించారు. అదే టైమ్ లో ఆయన ఇళయరాజాకు ఈ ఉన్నత పదవి గౌరవం దళిత కార్డుతోనే దక్కింది అన్న భావన వచ్చేలా ట్వీట్ చేయ‌డం మీదనే నెటిజన్లు గుస్సా అవుతున్నారు.

ఆయన ట్విట్టర్ లో ఏమన్నారు అంటే ప్రముఖుడైన  తమిళనాడుకు చెందిన దళిత్ మ్యుజీషియన్ ఇళయరాజాకు రాజ్యసభ పదవి దక్కింది. మోడీ సర్కార్ హయాంలోనే ఇలా దక్కింది అన్నట్లుగా సందేశం వినిపించారు. దీని మీద నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. పాశ్వాన్ ట్వీట్ ని ఖండిస్తూ వారంతా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. ఇళయరాజాలోని నిజమైన  ప్రతిభకు పట్టం కట్టలేదా. కేవలం దళిత కార్డుతోనే ఈ పదవి ఇచ్చారా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

గతంలో రాజ్యసభకు నామినేట్ అయిన వారిలో సచిన్ టెండూల్కర్, గౌతం గంభీర్ వంటి వారి అయితే క్రికెటర్లుగా తమ ప్రతిభతో గౌరవం పొందారని చెప్పేవారు ఇళయ‌రాజా వద్దకు వచ్చేసరికి ఈ కులం కార్డుని బయటకు తీయడమేంటి అని కూడా గుస్సా అవుతున్నారు. అసలు ఇళయరాజా దళిత్ అన్న సంగతి కూడా దేశంలో ఎవరికీ తెలియదు అని అలాంటిది ఆయనకు ఒక వైపు గౌరవం ఇస్తూనే మరో వైపు కులం బాణం వేసి గుచ్చడమేంటి అని కూడా ఫైర్ అవుతున్నారు.

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడా ఆయన కులాన్ని తీసుకురాలేదని, మరి పాశ్వాన్ మాత్రం ఇలా కులం పేరిట ట్వీట్ చేయడమేంటి అని మండుతున్నారు. మీ పెద్ద నాయకులను చూసి నేర్చుకోండి అని సలహా ఇస్తున్నారు. ఏది ఏమైనా ఇళయరాజాకు గౌరవం దక్కడం పట్ల ఆనందం ఒక వైపు వ్యక్తం అవుతూంటే మరో వైపు మాత్రం కులం కార్డు రచ్చ మాత్రం  వాడిగా వేడిగా సామాజిక మాధ్యమాలలో సాగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే అంతటి ఇళయరాజా కూడా అంతలా మరీ కులం చట్రలకే పరిమితం అయ్యేలా కొందరికి కనిపిస్తున్నారు అంటే అది భారతీయ సామాజిక ప్రగతికి అతి పెద్ద  విషాదమే అన్న వారూ ఉన్నారు.
Tags:    

Similar News