భవిష్యత్ లో మరణం దరిచేరదు: సీఎం

Update: 2018-10-28 11:27 GMT
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వైరాగ్యపు మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమవుతున్నాయి. కర్ణాటకలో జరుగుతున్న ఉపఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొని ఆయన ప్రసంగిస్తున్నారు. శనివారం మళవళ్లిలో ప్రచారం నిర్వహించేటప్పుడు భావోద్వేగానికి గురయ్యారు. ఎవ్వరు ఎప్పుడు చనిపోతారో తెలియదని.. రేపే చనిపోయినా చనిపోవచ్చని.. అందుకే ఉన్నప్పుడు కాసిన్ని పనులు చేయాలని ఆయన ఉద్వేగంతో మాట్లాడారు. ఇది మీడియాలో వైరల్ అయ్యి కుమారస్వామి రేపే చనిపోతానంటున్నారని తీవ్ర చర్చకు దారితీసింది.

తాజాగా ఆదివారం పాండవపుర పట్టణంలోని మాండ్య  పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారంలో కుమారస్వామి తన వ్యాఖ్యలు దుమారం రేగడంపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను అపార్ధం చేసుకోవద్దని కోరారు. సమీప భవిష్యత్తులో తనకు మరణం సంభవించే అవకాశమే లేదని.. 84 ఏళ్ల వరకు మృత్యువు తన దరికి చేరదని కుమారస్వామి చెప్పుకొచ్చారు.

ఇక ప్రచారంలో ప్రభుత్వ శాఖల్లో పెరిగిపోతున్న అవినీతిని సీఎం కుమారస్వామి ప్రస్తావించారు. ప్రభుత్వ అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో కోట్ల కొద్ది నగదు - కేజీ కొద్ది బంగారు ఆభరణాలు దొరుకుతుండడం  ప్రభుత్వశాఖల్లో అవినీతికి అద్ధం పడుతోందని ఆయన మండిపడ్డారు. రుణమాఫీ చేస్తానని రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని కూలుస్తామంటున్న బీజేపీ ఆశలు నెరవేరవని స్పష్టం చేశారు.
   

Tags:    

Similar News