స్వదేశంలో చంపేస్తారేమో? అమెరికా వెళ్లిపోతా.. బంగ్లా స్టార్ దీన స్థితి
సొంత దేశానికి 17 ఏళ్లకు పైగా అంతర్జాతీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించిన ఆ స్టార్ ఆల్ రౌండర్ ఇప్పుడు అత్యంత కఠిన పరిస్థితుల్లో ఉన్నాడు.
సొంత దేశానికి 17 ఏళ్లకు పైగా అంతర్జాతీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించిన ఆ స్టార్ ఆల్ రౌండర్ ఇప్పుడు అత్యంత కఠిన పరిస్థితుల్లో ఉన్నాడు. చివరగా దేశానికి ఒకే టెస్టు మ్యాచ్ ఆడతానని, ఆ తర్వాత కుటుంబంతో అమెరికాకు వెళ్లిపోతానని, మరెప్పటికీ తిరిగిరానని, తనను క్షమించాలని అతడు వేడుకుంటున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికినట్లు చెప్పిన అతడు ఇకపై టెస్టులు ఆడేది కష్టమే అంటున్నాడు. అయితే, ఎంతగానో ప్రేమించే దేశానికి ఒకటే టెస్టు ఆడతానని అనుమతివ్వాలని వేడుకుంటున్నాడు.
బంగ్లాకు ఏకైక అంతర్జాతీయ స్టార్
బంగ్లాదేశ్ సీనియర్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ మేటి ఆటగాడు. ఈ ఏడాది అతడు షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచాడు. అయితే, రెండు నెలల కిందట చెలరేగిన అల్లర్లలో హసీనా పదవీచ్యుతరాలైన సంగతి తెలిసిందే. దీంతోనే షకిబ్ కూ కష్టాలు మొదలయ్యాయి. బంగ్లాలో అల్లర్ల సమయంలో షకిబ్ కెనడాలో లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. ఆ తర్వాత నేరుగా పాకిస్థాన్ కు వచ్చాడు. ఇప్పుడు ఇండియాలో టెస్టు సిరీస్ ఆడుతున్నాడు. అంటే అతడు స్వదేశానికి వెళ్లక నెలలు అవుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘బంగ్లాలో స్నేహితులు, కుటుంబసభ్యులు నా భద్రతపై ఆందోళనతో ఉన్నారు’ అని అతడు అన్నాడు. ఈ మాటలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
అతడిపై హత్య కేసు
హసీనా పార్టీ ఎంపీగా ఉన్న షకిబ్ పై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం హత్య కేసు పెట్టింది. హసీనాకు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనల్లో ఓ హత్య విషయంలో షకిబ్ పై కేసు నమోదైంది. దీంతో అతడు స్వదేశానికి వెళ్లలేదు. అయితే, ఇప్పుడు వెళ్లే సమయం వచ్చింది. బంగ్లాకు విదేశీ టూర్లు ఏమీ లేకపోవడంతో స్వదేశం వెళ్లక తప్పదు. ఈ నేపథ్యంలో స్వదేశంలో చివరగా ఒకే టెస్టు మ్యాచ్ ఆడతానని, ఆ తర్వాత కుటుంబంతో అమెరికా వెళ్లిపోతానని, ఎప్పటికీ స్వదేశానికి తిరిగిరానని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానికి షకిబ్ లేఖ రాశాడు.
భారత్ తోనే చివరి మ్యాచ్?
షకిబ్ ప్రస్తుతం బంగ్లాదేశ్ తరఫున భారత్ లో పర్యటిస్తున్నాడు. దీనితర్వాత ఆ జట్టు వచ్చే నెల సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. ప్రత్యర్థి పార్టీ ఎంపీ, హత్య కేసులున్న నేపథ్యంలో షకిబ్ ను ఈ సిరీస్ లో ఆడించడం కష్టమే. అంటే. ప్రస్తుతం భారత్ తో జరుగుతున్న రెండో టెస్టే అతడి కెరీర్ లో చివరిది అవుతుంది. ప్రపంచ కప్ తోనే టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికానని.. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీతో వన్డే క్రికెట్ కూ గుడ్‌బై చెబుతానని షకిబ్ తెలిపాడు. కాగా, షకిబ్ ది మిర్పూర్. చివరి టెస్టును అక్కడే ఆడాలని భావిస్తున్నాడు. బంగ్లా క్రికెట్ బోర్డు ఒప్పుకోకుంటే కాన్పూర్ టెస్టే చివరి టెస్టు అవుతుంది.
38 ఏళ్ల షకిబ్.. బంగ్లా తరఫున 70 టెస్టుల్లో 4600 పరుగులు చేశాడు. 242 వికెట్లు పడగొట్టాడు. 247 వన్డేల్లో 7,570 పరుగులు సాధించాడు. 317 వికెట్లు తీశాడు. 129 టీ20ల్లో ,2551 పరుగులు, 149 వికెట్లు పడగొట్టాడు.
కొసమెరుపు: షకిబ్ భద్రత తమ చేతిలో లేదని, తాము ఎవరికీ వ్యక్తిగతంగా భద్రత కల్పించలేమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫరూఖీ అహ్మద్ తెలిపాడు. అతడిపై ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వానిదే కీలకపాత్రగా చెప్పాడు.