ఉత్త‌ర కొరియాపై అమెరికా దాడికి మ‌ద్ద‌తిస్తాం:షింజో

Update: 2017-09-19 17:17 GMT
ప్ర‌స్తుతం ఉత్త‌ర కొరియా పేరు చెబితేనే అమెరికా, జ‌పాన్ లు వ‌ణికిపోతున్నాయి. ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాన్ ఉంగ్  వైఖ‌రి మార్చుకోవాల‌ని  ఐక్యరాజ్య సమితి క‌ఠిన ఆంక్ష‌లు విధించిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది. అంతా నా యిష్టం అన్న త‌ర‌హాలో కిమ్ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఐరాస మాట‌లు పెడ చెవిన పెట్టి జపాన్ మీదుగా రెండోసారి క్షిపణిని ప్రయోగించి అంద‌రికీ షాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. నెల రోజుల వ్యవధిలోనే 2 బాలిస్టిక్ ఖండాంతర క్షిపణులు జపాన్ లోని హోక్కైడో‌ ద్వీపం మీదుగా ప్రయాణించి పసిఫిక్ సముద్రంలో కూలిపోయాయి. దీంతో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా జపాన్ మంగళవారం తన క్షిపణి రక్షణ వ్యవస్థను హోక్కైడో‌ ద్వీపానికి తరలించాని నిర్ణయించింది.
ఈ నేప‌థ్యంలో ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు, అణ్వస్త్ర ప్రయోగాలను జపాన్ ప్రధాని షింజో అబె తీవ్రంగా ఖండించారు. వాటిని ‘ప్రపంచ ముప్పు'గా అభివర్ణించారు.

ఆ దేశం దుందుడుకు చ‌ర్య‌ల‌కు అడ్డుక‌ట్ట వేయ‌కుంటే ప్ర‌పంచానికి పెను ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశ‌ముంద‌ని షింజో అబె అభిప్రాయ‌ప‌డ్డారు. త్వ‌ర‌లో ఉత్త‌ర కొరియా దూకుడుకు చెక్ పెట్టాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. 'ఉత్తరకొరియా పరీక్షించిన 2 బాలిస్టిక్ మిస్సైల్స్‌ మా దేశం గుండా వెళ్లాయి. ఆ సమయంలో మా దేశ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు..' అని షింజో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ప‌నికిమాలిన చర్యల వ‌ల్ల ఉత్తరకొరియా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉద్రిక్తలు సృష్టించాల‌ని చూస్తోంద‌న్నారు. తాజాగా ఉత్త‌ర కొరియాపై  ఐక్య‌రాజ్యస‌మితి తీసుకున్న చ‌ర్య‌ల‌ను షింజో అభినందించారు. ఉత్తరకొరియా టెక్స్‌టైల్ ఎగుమతులపై ఐరాస‌ అంక్షలు విధించడాన్ని త‌మ దేశం స్వాగతిస్తోందని చెప్పారు. ఐక్య‌రాజ్య‌స‌మితి ఆంక్ష‌లు విధించినా, ప్ర‌పంచ దేశాలు ముక్త కంఠంతో ఉత్తరకొరియా చ‌ర్య‌ల‌ను ఖండిస్తున్నా ఆ దేశాధ్యక్షుడు కిమ్... మిస్సైల్ ప్రయోగాలు చేస్తుండ‌డం త‌న‌కు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోందన్నారు.

ఉత్తరకొరియాకు చెక్ పెట్టేందుకు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ సిద్ధ‌మ‌వ్వాల‌ని షింజో అన్నారు. ఉత్తరకొరియా బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగాలను కొన‌సాగిస్తే ఆ దేశంపై అమెరికా సైనిక చర్యకు దిగాలని ట్రంప్ కు సూచించారు. అన్ని ఆప్షన్లు తన టేబుల్ పై రెడీగా ఉన్నాయని ఉత్త‌ర కొరియాను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల‌ను షింజో గుర్తు చేశారు. ఉత్త‌ర కొరియా వైఖ‌రిలో మార్పు రాద‌ని, ఇక నిరీక్షించి ప్ర‌యోజ‌నం లేద‌ని ఆయ‌న‌ చెప్పారు. ఉత్తరకొరియాపై అమెరికా చేయ‌బోయే సైనిక దాడికి సహకరించేందుకు జపాన్ సిద్ధంగా ఉందన్నారు. ఇదే విష‌యాన్ని తాము గ‌తంలో కూడా అమెరికాకు చెప్పామ‌ని షింజో అన్నారు. ఉత్తరకొరియాకు ముకుతాడు వేయాలంటే దాని మిత్ర దేశాలైన చైనా, రష్యాలు కఠిన వైఖరి అవలంబించాలని  షింజో  అభిప్రాయపడ్డారు. కిమ్ పై  ఆ రెండు దేశాలు ఒత్తిడి తీసుకొస్తే ఈ పరిస్థితి త‌లెత్తేది కాద‌ని, కానీ చైనా, రష్యాలు అలా చేయక‌పోవ‌డం బాధాక‌ర‌మ‌ని ఆయ‌న అన్నారు.

ప్రస్తుతం జపాన్ రెండంచెల క్షిపణి రక్షణ వ్యవస్థను కలిగి ఉంది. శత్రువులు దాడిచేస్తే వారి యుద్ధ విమానాలను, క్షిపణులను సముద్రం నుంచే కూల్చివేయడానికి స్టాండర్డ్ మిసైల్-3 క్షిపణులను వినియోగించడం మొదటి అంచె. ఇది విజయవంతం కాకపోతే ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే పీఏపీ-3 క్షిపణులను ప్రయోగిస్తుంది. స్వీయరక్షణ కోసం జపాన్ తన సైన్యాన్ని అతి తక్కువగా వినియోగిస్తోంది. కేవలం తమ దేశం మీదుగా ఏవైనా క్షిపణులు ప్రయాణించినా లేదా దాడిచేసిన సందర్భాల్లో మాత్రమే వారికి అనుమతిస్తుంది. 2015లో ఆమోదించిన కొత్త రక్షణ చట్టం ప్రకారం... జపాన్, దాని మిత్రదేశం అమెరికా భద్రతకు ప్రమాదకరంగా మారితే క్షిపణులను ప్రయోగించవచ్చు.
Tags:    

Similar News