వాజ్ పేయ్ వద్దకు కాంగ్రెస్ మంత్రులు...ఇందిర చెప్పిందేంటి...?

Update: 2022-08-29 15:43 GMT
ఈ దేశానికి మహిళ పవర్ ఏంటో చూపించిన వీరనారీమణి ఇందిరా గాంధీ. ఆమె ఏకంగా పదహారేళ్ల పాటు ఈ దేశాన్ని ఏలారు. మధ్యలో మూడేళ్ళు తప్ప రెండు దశాబ్దాల పాటు ఆమె అత్యున్నత పీఠం మీద కూర్చుని భారత దేశాన్ని పాలించారు. దాని రూపు రేఖలు మార్చారు. గరీబీ హఠావో వంటి నినాదం ఇవ్వడమే కాదు, నాడు పేదరికాన్ని తరిమికొట్టే అతి పెద్ద యుద్ధానికి శ్రీకారం చుట్టారు.

బ్యాంకులను జాతీయం చేయడం ఆమె తీసుకున్న మరో సాహసోపేతమైన నిర్ణయం. ఇక జనాభా పెరిగిపోయి అభివృద్ధికి  విఘాతం అనుకున్నపుడు ఆమె కుటుంబ నియంత్రణను దేశంలో ప్రవేశపెట్టి విజయవంతమయ్యారు. ప్రజలకు కుటుంబ నియంత్రణ మీద పూర్తి అవగాహన వచ్చేలా చేశారు.

ఈ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించడానికి కూడా సాహసం కావాలి. అలాగే పాకిస్థాని పీచమణిచి బంగ్లాదేశ్ పేరిట కొత్త దేశం సృష్టి చేయడానికి కూడా గట్స్ కావాలి. అవి ఇందిరమ్మకు నిండుగా ఉన్నాయి. ఖలిస్థాన్ పేరిట వేర్పాటు ఉద్యమం పురుడుపోసుకున్న వేళ భారీ ఆపరేషన్ చేపట్టి దేశ సమగ్రతను కాపాడడంలో ఆమె పేరు చరిత్రలో పదిలం.

ఇక ఇందిరాగాంధీ ఎవరినీ లెక్కచేయరు. విపక్షాల సలహాలను ఆమె పట్టించుకునే వారు కాదు అని ప్రచారం లో ఉన్న మాట. కానీ అది తప్పు అని ఇటీవలే కాంగ్రెస్ ని వదిలి బయటకు వచ్చిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ చెప్పుకొచ్చారు. తాను ఎమ్ ఎల్ ఫోతేదారు ఇందిరమ్మ మంత్రివర్గంలో జూనియర్ మంత్రులుగా  ఉండగా ఆమె తమ‌తో అన్న మాటలను ఆయన మీడియా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

విపక్ష నేత అటల్ బిహారీ వాజ్ పేయ్ ని తరచూ కలుస్తూ ఉండండి అంటూ ఆమె స్వయంగా తన మంత్రులను విపక్ష నేత వద్దకు పంపేవారట. ఆ విధంగా సీనియర్లను గౌరవించడం, విపక్షాలను పరిగణనలోకి తీసుకోవడం తనకు ఇందిర నేర్పిన రాజకీయ విద్య అని ఆయన చెప్పుకున్నారు.

విమర్శ చేయాలంటే వ్యక్తిగతంగా  ఉండరాదని, అది హద్దులు దాటరాదని కూడా ఆమె తమకు నేర్పిన పాఠాలు అని ఆజాద్ అన్నారు. దురదృష్టవశాత్తు  రాహుల్ గాంధీకి ఈ లక్షణాలు అలవడలేదని ఆజాద్ అనడం విశేషం. సీనియర్లు చెప్పే మాటలను ఇచ్చే సలహాలను ఇందిర ఎపుడూ  స్వీకరించేవారని, 1998 నుంచి 2004 వరకూ సోనియా గాంధీ అలాగే ఉండేవారని,ఎపుడైతే 2004లో కుమారుడు రాహుల్ గాంధీ ఎంట్రీ ఇచ్చారో ఆమె మారిపోయారని, కుమారుడి మీదనే ఆధారప‌డడం మొదలెట్టారని ఆజాద్ కాంగ్రెస్ గుట్టు మొత్తం విప్పి చెప్పారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News