బీజేపీ నేతలపై నడ్డా ఆంక్షలు

Update: 2022-06-07 06:37 GMT
ఇతర పార్టీలతో పొత్తుల విషయమై నేతలెవరు నోరిప్పద్దని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశించారు. రెండు రోజుల పర్యటన కోసమని విజయవాడకు వచ్చిన నడ్డా సోమవారం రాత్రి కోర్ కమిటీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మిత్రపక్షం జనసేన నేతల డిమాండ్లను కమలనాథులు నడ్డా దృష్టికి తీసుకెళ్ళారు. దానికి నడ్డా మాట్లాడుతూ పొత్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఇపుడు లేదని తేల్చేశారు.

ఇతర పార్టీలతో పొత్తుల గురించి పార్టీలోని పార్లమెంటరీ బోర్డు డిసైడ్ చేస్తుందన్నారు. ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉన్నది కాబట్టి పొత్తులపై ఇప్పటినుండే మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కాబట్టి ఇతర పార్టీలు ఎంతగా ప్రయత్నించినా, రెచ్చగొట్టినా పొత్తుల గురించి రాష్ట్రనేతలెవరు మాట్లాడద్దని నడ్డా స్పష్టంగా ఆదేశించారు. దాంతో నేతలెవరు ఇక నోరిప్పలేదు.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇపుడు పొత్తుల గురించి జనసేన నేతలు అడగటం లేదు. ఇప్పటికే మిత్రపక్షంగా ఉన్న కారణంగా తమ అధినేత పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

పవన్ సీఎం అభ్యర్ధి అయితే బీజేపీతో కూడా పొత్తుంటుందని లేకపోతే చివరకు ఒంటరి పోటీకే తమ పార్టీ మొగ్గు చూపుతుందని జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ స్పష్టంగా ప్రకటించేశారు.

జనసేన నేతల మూడ్ చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయటానికే రెడీ అవుతున్నట్లు అర్ధమవుతోంది. పవన్ ఇచ్చిన మూడు ఆప్షన్లలో బీజేపీకే కాదు ఇదే సమయంలో చంద్రబాబునాయుడుకు  కూడా ఇలాంటి సంకేతాలే పంపారు.

జనసేనతో పొత్తు పెట్టుకోవాలంటే తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాల్సిందే అని స్పష్టంగా చెప్పేశారు. గతంలో త్యాగాలు చేశానని, పల్లకీ మోశానని, అవసరమైనంత తగ్గినట్లు గుర్తుచేశారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో త్యాగాలు చేసేది లేదని, తగ్గేది లేదని, పల్లకీ మోసేది లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దీంతో ఇటు టీడీపీ అటు బీజేపీ నేతల్లో అలజడి మొదలైంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
Tags:    

Similar News