కొడుకు జ‌న‌సైనికుడు.. తండ్రి క‌మ‌ల‌నాథుడు

Update: 2019-03-13 05:15 GMT
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన నాదెండ్ల భాస్క‌ర్ రావు తాజాగా ఆస‌క్తిక‌ర నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. గ‌డిచిన కొద్దికాలంగా ఏ పార్టీలో లేని ఆయ‌న తాజాగా బీజేపీ తీర్థం తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. టీడీపీలో కీల‌క‌భూమిక పోషించి.. ఎన్టీఆర్ కు అత్యంత స‌న్నిహితుడిగా ఉన్న ఆయ‌న‌.. త‌న‌ను న‌మ్మిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి.. ఏపీ సీఎం అయిన వైనం తెలిసిందే.

నెల రోజుల సీఎంగా ఉమ్మ‌డి ఏపీకి ఉన్న ఆయ‌న ప్ర‌భుత్వాన్ని.. తెలుగు ప్ర‌జ‌ల నిర‌స‌న‌తో కేంద్రం వెన‌క్కి త‌గ్గాల్సి వ‌చ్చింది. ఎన్టీఆర్ ను ప‌ద‌వీచ్యుతుడ్ని చేసేందుకు కాంగ్రెస్ ర‌చించిన వ్యూహంలో నాదెండ్ల ఒక పావుగా ప‌లువురు చెబుతారు. ఎన్టీఆర్ కు పోటు పొడిచింది నాదెండ్ల అయినా.. క‌త్తి మాత్రం కాంగ్రెస్ దేన‌న్న‌ది తెలిసిందే.

సుదీర్ఘ‌కాలం పాటు కాంగ్రెస్ లో ఉన్న ఆయ‌న‌.. క్రియాశీల రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. ఆయ‌న కుమారుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ కాంగ్రెస్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంద‌టం.. ఉమ్మ‌డి రాష్ట్రానికి చిట్ట‌చివ‌రి అసెంబ్లీ స్పీక‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌టం తెలిసిందే. ఈ మ‌ధ్య‌నే జ‌న‌సేన‌లో చేరిన ఆయ‌న‌.. ప‌వ‌న్ కు అత్యంత స‌న్నిహితంగా ఉంటున్నారు. కీల‌క రాజ‌కీయ నిర్ణ‌యాల్లో ఆయ‌న పాత్ర ఉంద‌ని చెబుతున్నారు. త‌న ప‌క్క‌న ఏ నేత‌ను పెట్టుకోని ప‌వ‌న్‌.. నాదెండ్ల మ‌నోహ‌ర్ ను మాత్రం ప్ర‌తి విష‌యంలోనూ త‌న ప‌క్క‌నే ఉంచుకోవ‌టం క‌నిపిస్తుంది.

నాదెండ్ల మ‌నోహ‌ర్ కు ప‌వ‌న్ ఇంత భారీగా ప్రాధాన్య‌త ఇస్తున్న వేళ‌.. ఆయ‌న తండ్రి నాదెండ్ల భాస్క‌ర్ రావు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాధ‌మిక చ‌ర్చ‌లు ఇప్ప‌టికే పూర్తి అయిన‌ట్లుగా తెలుస్తోంది.

తాజాగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ తో భేటీ అయిన ఆయ‌న ఏపీ.. తెలంగాణ రాజ‌కీయాల గురించి ఆయ‌న‌తో చ‌ర్చించిన‌ట్లుగా చెబుతున్నారు. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే త్వ‌ర‌లోనే బీజేపీ గూటికి నాదెండ్ల భాస్క‌ర్ రావు చేరుకుంటార‌ని చెబుతున్నారు. మొత్తానికి తండ్రి క‌మ‌లం చెంత‌కు చేరితే.. కొడుకు జ‌న‌సేన‌లో కీల‌క భూమిక పోషించ‌టం విశేషం.
Tags:    

Similar News