ఏపీ ఏటా 11వేల కోట్ల వ‌డ్డీ క‌డుతోంద‌ట‌

Update: 2016-08-11 05:12 GMT
సుదీర్ఘ కాలం త‌ర్వాత తెర‌మీద‌కు వ‌చ్చిన మాజీ శాసనసభాపతి, కాంగ్రెస్ నాయ‌కుడు నాదెండ్ల మనోహర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన షాకింగ్ వాస్త‌వాల‌ను ప్ర‌క‌టించారు. ఏపీకి ఉన్న అప్పులు-చేస్తున్న వ్య‌యం-ద‌క్కుతున్న ఫ‌లితం నాదెండ్ల మ‌నోహ‌ర్ ఆధారాల‌తో స‌హా తెలిపిన వివ‌రాలు షాకింగ్‌గా ఉన్నాయ‌నే చ‌ర్చ న‌డుస్తోంది. తాజాగా నాదెండ్ల మ‌నోహ‌ర్‌ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు అధికారం చేపట్టిన ఈ రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్రం రూ.85 వేల కోట్లు అప్పు చేసిందని, వాటిపై ప్రతి ఏటా రూ.11 వేల కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. ఒక వంక నిధులు లేవని ప్రకటనలు చేస్తూ ప్రతి పనిలోనూ దుబారా వ్యయం చేయటం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు. ఇలా అయితే రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోతుందని ప్రశ్నించారు.

రైతు రుణమాఫీ, పొదుపు సంఘాల రుణమాఫీ ఇలా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయకుండా ఇంత డబ్బు ఏమైందని నాదెండ్ల మ‌నోహ‌ర్‌ ప్రశ్నించారు. గత రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో పేదలకు ఒక్క ఇల్లు కూడా నిర్మించని విషయాన్ని గమనించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్ర‌బాబుతో సహా మంత్రులు అందరూ పెట్టుబడులకు అంటూ విదేశాలు పర్యటిస్తున్నారని అయితే గత ఆరు నెలల కాలంలో రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడులంటూ కేంద్రం విడుదల చేసిన జాబితాలో ఏపీ పేరే లేదన్నారు. 70వేల కోట్లతో కర్ణాటక తొలి స్థానంలో, 21వేల కోట్లతో గుజరాత్‌ రెండవ స్థానంలో, మహారాష్ట్ర, తెలంగాణా మూడు, నాలుగు స్థానాల్లో ఉండగా చిన్న రాష్ట్రమైన చత్తీస్‌ఘడ్‌ సైతం రూ.8వేల కోట్లను ఆకర్షించి 5వ స్థానంలో ఉందని ఏపీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పు రూ.1.95 లక్షల కోట్లని, ఇవన్నీ కేంద్రం విడుదల చేసిన అధికారిక లెక్కలన్నారు. వాస్తవాలిలా ఉంటే ఏదో జరిగిపోతుందంటూ మసిపూసి మారేడుకాయ చేసే ప్రచారం జరుగుతుందని, పాలకులు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి, రాష్ట్రాన్ని నిజంగా ముందుకు ఎలా నడపాలో చూడాలని సీఎం చంద్ర‌బాబుకు సూచించారు.

గత ఏడాది గోదావరి పుష్కరాలకు రూ.1800 కోట్లు మన రాష్ట్రం ఖర్చుపెట్టిందని, అయినా యాత్రికుల మన్ననలు పొందలేక పోయిన విషయాన్ని మ‌నోహ‌ర్‌ గుర్తు చేశారు. ఇప్పుడు కృష్ణా పుష్కరాల పేరిట జరుగుతున్న అంతులేని ఖర్చుకు లేక్కే లేదని, దుబారా జరుగుతున్న విషయం ప్రజలకు ఇప్పటికే అర్థం అయిందన్నారు. కృష్ణమ్మ జలం చేరని ఘాట్‌కు సైతం మరమ్మతులు, పనులు అంటూ కోట్లాది రూపాయలు చూపిస్తున్నారని, ఇదంతా ఎవరిని బాగు చేయటానికని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు రాష్ట్రానికి అన్ని వేల కోట్లు ఇచ్చాం, ఇన్ని వేల కోట్లు ఇచ్చాం అంటూ ప్రకటనలు చేస్తుంటే, వారు వాస్తవంగా ఎంత ఇచ్చారో చెప్పలేని దీన స్థితికి రాష్ట్రం చేరిందని మ‌నోహ‌ర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.
Tags:    

Similar News