ఎంపీ గా ఎన్నికైతే.. జబర్ధస్త్ పై నాగబాబు స్పందన!

Update: 2019-04-26 01:30 GMT
తను ఎంపీగా ఎన్నికైనా జబర్ధస్త్ కార్యక్రమాన్ని మాత్రం వదిలేది లేదని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు నాగబాబు. ఆ కార్యక్రమానికి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో మిశ్రమ స్పందనలున్నాయి. కొందరేమో ఆ కార్యక్రమాన్ని బాగా  ఆస్వాధిస్తారు. మరికొందరు దాన్నో బూతు కామెడీగా విమర్శిస్తారు.

ఈ విషయంలో ఎవరి ధోరణి వారికి రైటు అనిపిస్తుంది. ఎవరినీ తప్పు పట్టలేం. ఎందుకంటే  అవి వారి వారి అభిప్రాయాలు. అలాగే ఆ కార్యక్రమానికి యాంకరింగ్ చేయడం విషయంలోనూ, ఆ కార్యక్రమాన్ని  ప్రొడ్యూస్ చేయడంలోనూ కూడా ప్రముఖులపై భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వారిని సమర్థిస్తారు, మరికొందరు వారిని ఈ విషయంలో తీవ్రంగా విమర్శిస్తారు. మరీ దిగజారిపోయారని దుమ్మెత్తి పోస్తారు,.

ఇలాంటి అభిప్రాయాల మధ్యనే కొన్నేళ్లుగా జబర్ధస్త్  టాప్ టీఆర్పీలను సంపాదించుకొంటూ సాగుతూ ఉంది. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి జడ్జిలుగా వ్యవహరించిన ముఖ్యులు ఇద్దరూ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వైనాన్ని ప్రస్తావించవచ్చు. నాగబాబు జనసేన తరఫున నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేయగా, రోజా ఆల్రెడీ ఎమ్మెల్యే. మరోసారి ఆమె పోటీలో ఉన్నారు.

ఆమె ఎమ్మెల్యేగా ఉన్నా ఆ కార్యక్రమానికి జడ్జిగా కొనసాగింది. ఇక తను ఎంపీగా నెగ్గినా ఆ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తానంటూ నాగబాబు వ్యాఖ్యానించారు. తను ఓటు వేయడానికి వెళ్లినప్పుడే ఆ ప్రశ్న ఎదురైనట్టుగా నాగబాబు చెప్పారు. ఒక పెద్దావిడ తనను అడిగిందని, 'ఎంపీగా నెగ్గితే జబర్ధస్త్ జడ్జిగా మానేస్తావా..' అని ఆమె అడిగిందని - తను ఆ విషయంలో స్పష్టతతో ఉన్నట్టుగా నాగబాబు చెప్పారు.

'అదో సర్సీస్ లాంటిది. పెయిడ్ సర్వీస్ లాంటిది. జనాలను నవ్వించినందుకు డబ్బులు కూడా వస్తోంది..'అని నాగబాబు అంటున్నారు. తను ఎంపీగా ఎన్నికైనా ఆ కార్యక్రమ వ్యాఖ్యాతగా కొనసాగనున్నట్టుగా నాగబాబు కుండబద్ధలు కొట్టి చెప్పారు! ఇక విమర్శకులు స్టార్ట్ చేసుకోవచ్చు!
Tags:    

Similar News