చిరంజీవి ఆశ‌యం కోసం ప‌నిచేస్తాం: నాగ‌బాబు కామెంట్స్ వైర‌ల్

Update: 2022-10-05 04:50 GMT
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం.. గాడ్‌ఫాద‌ర్ విడుద‌ల సంద‌ర్భంగా ప్రెస్‌మీట్లో మాట్లాడిన చిరంజీవి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయాల గురించి.. మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స్పందించిన చిరు త‌న మ‌ద్ద‌తు త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కే ఉంటుంద‌ని తేల్చిచెప్పిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని ఆకాంక్షిస్తున్నాన‌ని చెప్పడంతో మెగాభిమానుల్లో, జ‌న‌సేన పార్టీ నేత‌లు, శ్రేణుల్లో న‌యా జోష్ నెల‌కొంది.

ఈ నేప‌థ్యంలో చిరంజీవి వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న పెద్ద త‌మ్ముడు, జ‌నసేన పార్టీ నేత నాగ‌బాబు స్పందించారు. అన్న‌య్య మాట‌లు త‌మ‌కు ఎంతో భ‌రోసానిచ్చాయ‌ని తెలిపారు. అన్న‌య్య కోరిక మేర‌కు జ‌న‌సేన పార్టీ నాయ‌కులు, శ్రేణులు చిరంజీవి ఆకాంక్ష‌ను నెర‌వేర్చ‌డానికి క‌ష్ట‌ప‌డి పనిచేస్తామని చెప్పారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదికగా నాగ‌బాబు ఒక ప్ర‌క‌ట‌న‌ను పోస్టు చేశారు.

‘‘మేమిద్దరం చెరోవైపు ఉండటం కంటే నేను తప్పుకోవడమే నా తమ్ముడు రాజకీయాల్లో రాణించడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే రాజకీయాల నుంచి తప్పుకున్నాను’’ అని మెగాస్టార్‌ చిరంజీవి చెప్పిన మాట కోట్లాది మంది తమ్ముళ్ల మనసులను గెలుచుకుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు తెలిపారు.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ లాంటి నిబద్ధత ఉన్న నాయకుడు పగ్గాలు చేపట్టాలన్నదే చిరంజీవి ఆకాంక్ష అని నాగ‌బాబు చెప్పారు.

అన్న‌య్య చిరంజీవి కోరిక‌ తప్పకుండా నెరవేరుతుందని.. జనసైనికులుగా తామంతా ఈ మ‌హ‌త్ కార్యాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తామని నాగబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తన త‌మ్ముడు పవన్‌ కల్యాణ్‌ నిజాయతీ, నిబద్ధత తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, అత‌డు రాష్ట్రాన్ని ఏలే నాయ‌కుడు కావాల‌ని చిరంజీవి చెప్పిన మాటలు జన సైనికులకు, వీర మహిళలకు ఎంతో మనోధైర్యాన్నిచ్చాయని నాగ‌బాబు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

భవిష్యత్‌లో తాను ఏ పక్షాన ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారని చిరంజీవి చెప్పిన మాటలకు అనుగుణంగా జనసైనికులంతా మరింత శ్రమించి ప్రజల మన్ననలు పొందాలని నాగబాబు పిలుపునిచ్చారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News