ఎన్నికలెపుడన్నది కాదండీ... మీ పార్టీ రెడీగా ఉందా? లేదా? అన్నదే పాయింట్

Update: 2022-06-04 06:32 GMT
చంద్రబాబునాయుడు చేస్తున్న ముందస్తు ఎన్నికల జపం ఇపుడు జనసేనకు కూడా పాకినట్లుంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు విశాఖపట్నంలో పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ముందస్తు ఎన్నికల గురించి చంద్రబాబు చాలాకాలంగా చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది అదే విషయానికి మద్దతుగా నాగబాబు కూడా మొదలుపెట్టారు.

నిజానికి ముందస్తు ఎన్నికలు గనుక వస్తే జనసేన చేతులెత్తేయాల్సిందే. ఎందుకంటే పార్టీ తరపున పోటీ చేయడానికి కనీసం 140 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులే లేరన్నది వాస్తవం. మొన్నటి ఎన్నికల్లో 15 వేల ఓట్ల కన్నా ఎక్కువ తెచ్చుకున్న వారిని లెక్కిస్తే 15 మందికన్నా ఉండరు.

వారంతా వచ్చే ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటే డౌటనే చెప్పాలి. అసలు ఎంతమంది పార్టీలో ఉన్నారో ? ఎంతమంది యాక్టివ్ గా ఉన్నారో కూడా తెలీదు.

సరే మిత్రపక్షం బీజేపీకి కొన్ని సీట్లను వదిలేసినా మిగిలిన సీట్లలో పోటీ చేయటానికి చాలా నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులే లేరన్నది వాస్తవం. అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్ధితే ఇలాగుంటే ఇక పార్లమెంటు అభ్యర్థుల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. క్షేత్ర స్ధాయిలో పార్టీ పరిస్థితి ఇలాగుంటే దాన్ని చక్కదిద్దు కోవాల్సింది పోయి ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము రెడీగా ఉన్నట్లు నాగబాబు చెప్పటమే పెద్ద జోక్.

పార్టీ పెట్టి పదేళ్ళయినా ఇంతవరకు ఏ ఎన్నికలో కూడా ప్రభావం చూప లేని పార్టీ ఏదన్నా ఉందంటే అది జనసేన మాత్రమే. పార్టీలో గట్టి నేతలు పదిమంది చెప్పమంటే ఒకటి నుండి పది వరకు పవన్ తప్పు మరొకళ్ళు కనబడరు.

అధినేత కాబట్టి పవన్ పేరు చెప్పాల్సొస్తోందంతే. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా పవన్ ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ముందస్తు ఎన్నికల ముచ్చటను పక్కన పెట్టేసి పార్టీని బలోపేతం చేసే విషయంపై దృష్టిపెడితే బాగుంటుంది. రావాల్సిన ఎన్నికలు ఎలాగూ వస్తాయి కాబట్టి దాని గురించి నాగబాబు ఆలోచించక్కర్లేదు.
Tags:    

Similar News