ఆమె వ‌ద్ద‌న్నా ఆయ‌న్ను కాంగ్రెస్ చేర్చుకుంటోంది

Update: 2018-04-23 11:30 GMT
తెలంగాణ కాంగ్రెస్‌ లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకోనుందని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. టీడీపీలో ఉన్న స‌మ‌యంలో తెలంగాణ టీడీపీ నాయ‌కుడిగా ఓ వెలుగు వెలిగి...అనంత‌రం బీజేపీలో చేరినప్పటికీ త‌ర్వాత ఆ ప్రాధాన్యం ద‌క్క‌లేదనే అందుకే పార్టీ మారాల‌ని సీనియ‌ర్ నేత నాగం జ‌నార్ద‌న్ రెడ్డి డిసైడ్ అయిన‌ట్లు వార్త‌లు రావ‌డం, ఇది నిజం చేస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ ర‌థ‌సార‌థి ప్రాథ‌మిక చ‌ర్చ‌లు పూర్త‌యిన‌ట్లు మీడియాలో హోరెత్త‌డం తెలిసిన సంగ‌తే. ఈనెల 25వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. అయితే నాగం రాక‌కు ముందే...ఆ జిల్లాలో అగ్గి రాజుకుంది.

మ‌రోవైపు నేతల వర్గపోరుతో పూర్వ మహబూబ్‌ నగర్ జిల్లా కాంగ్రెస్‌లో వేడి రాజుకుంటోంది. ఇప్పటికే ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో ఇద్దరు ముఖ్యనేతలు జైపాల్‌ రెడ్డి - డీకే అరుణ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. టీడీపీలో ఉన్న రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్‌ లోకి తీసుకురావడంలో జైపాల్‌ రెడ్డి కీలకపాత్ర వహించారని, అదే రీతిలో ఇప్పుడు బీజేపీలో ఉన్న నాగం జనార్దన్‌ రెడ్డిని పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని డీకే అరుణ వర్గం ఆరోపిస్తోంది. పార్టీలోకి నాగం రాకను డీకే వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎంపీ నంది ఎల్లయ్య - ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి - మరో ముగ్గురు నేతలతో ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిసి జైపాల్‌ రెడ్డిపై.. డీకే అరుణ ఫిర్యాదు చేసినట్టు వార్త‌లు వ‌చ్చాయి. నాగం రాక‌ను వ్యతిరేకిస్తున్న జిల్లా నేత‌ల‌తో క‌లిసి .. రాహుల్ తో ప్రత్యేకంగా స‌మావేశ‌మైన డీకే అరుణ .. ఆయన రాక వల్ల కలిగే న‌ష్టాల‌ను రాహుల్ కు వివ‌రించారు. నాగం ను పార్టీలోకి తీసుకుంటే ఇన్ని రోజులు పార్టీ కోసం క‌ష్టప‌డి ప‌నిచేసిన క్యాడ‌రంతా అధికార పార్టీ వైపు వెళ్ళే అవ‌కాశముందని ఆమె చెప్పారు.

మ‌రోవైపు ఎమ్మెల్సీ దామోద‌ర్ రెడ్డి సైతం నాగంపై ఇటీవ‌ల మీడియాతో స్పందిస్తూ మండిప‌డ్డారు. నాగం క్యాడర్ లేని లీడర్ అని నాగంను నిలబడితే ఓటమి ఖాయమ‌ని ఎద్దేవా చేశారు.  నాగం ఎంపీగా పోటీ చేసి...తన కొడుకును ఎమ్మెల్యేగా నిలబడితేపెడితే డిపాజిట్ రాలేదని వ్యాఖ్యానించారు.  నాగంను కాంగ్రెస్ లోకి తెస్తే తాము ఎట్టి పరిస్థితిలోనూ సహకరించమ‌ని తేల్చిచెప్పారు. త‌న‌తో స‌హా ఎమ్మెల్యే డీకే అరుణ - ఎంపీ నంది ఎల్లయ్య ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లి నాగం ను తీసుకోవడం వల్ల జరిగే పరిణామాలను రాహుల్ గాంధీకి వివరించామని ప్ర‌క‌టించారు. నాగం - జైపాల్ రెడ్డికి మ‌ధ్య ఒప్పందం ఉంద‌ని...జైపాల్ రెడ్డి ఎంపీగా పోటీ చేయ‌కూడ‌ద‌ని భావిస్తే..నాగంను కాంగ్రెస్ లోకి తేవాలనే లెక్క‌ల్లో భాగంగానే ఈ చేరిక అని ఆరోపించారు.

కాగా, టీడీపీ అభ్యర్థిగా నాగ‌ర్‌ క‌ర్నూల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నాగం జనార్ధన్ రెడ్డి గతంలో పలుమార్లు దామోదర్ రెడ్డిపై విజయం సాధించారు. 2012లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో నాగం జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే రాజకీయంగా తనకు ఇబ్బందులు తప్పవని దామోదర్ రెడ్డి భావిస్తున్నారు. ఈ తరుణంలో నాగం జనార్ధన్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రాకుండా అడ్డుకొనే ప్రయత్నాలను ప్రారంభించారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో నాగం జనార్ధన్ రెడ్డి చ‌ర్య‌ల‌ కారణంగానే కాంగ్రెస్ పార్టీ నేతలు మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యంగా నాగర్ కర్నూల్ ప్రాంతంలో ఇబ్బందులు పడిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారని స‌మాచారం. నాగం జనార్ధన్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలను ఏ రకంగా ఇబ్బందులకు గురిచేసిన విషయాలను కాంగ్రెస్ పార్టీ నేతలు పార్టీ అధిష్టానానికి విన్నవించార‌ని స‌మాచారం. అయిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీ ఆయ‌న చేరిక‌కు ఓకే చెప్ప‌డం డీకే అరుణ‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ అని భావిస్తున్నారు.
Tags:    

Similar News