జగన్ క్యాండిడేట్ కూడా సీన్లోకి వచ్చేశాడు

Update: 2015-11-03 08:05 GMT
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉందో లేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే.. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర సర్కారుకు అనుకూలమా.. ప్రతికూలమో కూడా స్పష్టంగా ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఆ మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేల చేత అధికారపార్టీకి ఓట్లేయించిన వైఎస్ జగన్.. ఇప్పడు అందుకు భిన్నంగా వరంగల్ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిలో దించటం గమనార్హం.

ఇంతా చేస్తే.. ఏ రోజైనా తెలంగాణ అధికారపక్షంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారా? అంటే అదీ కనిపించదు. కానీ.. తాను ఎన్నికల బరిలో ఉండాల్సిందేనంటూ వరంగల్ ఉప ఎన్నికల గోదాలోకి జగన్ పార్టీ వచ్చేసింది.

తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ అభ్యర్థిని పార్టీ ఎంపిక చేసింది. వరంగల్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా నల్లా సూర్యప్రకాశ్ ను బరిలోకి దించుతున్నట్లు తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొంగులేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. జగన్ అభ్యర్థి బరిలోకి దిగారు.. ఏమని ప్రచారం చేస్తారంటే.. వైఎస్ హయాంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రచారం చేస్తామని.. తమ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని వరంగల్ ఓటర్లను తాము అభ్యర్థిస్తామని పొంగులేటి చెప్పుకొచ్చారు. మరి.. వరంగల్ ఓటర్లు జగన్ బ్యాచ్ కు ఎన్ని ఓట్లు వేస్తారో చూడాలి.
Tags:    

Similar News