గృహనిర్బంధంలో టీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే..?

Update: 2018-09-11 05:25 GMT
టీఆర్ ఎస్ లో అసంతృప్తి - అసమ్మతి సెగలు రాజుకున్నాయి. టికెట్ రాని నేతలు అలకపాన్పులు ఎక్కుతున్నారు. ఓ రకంగా టీఆర్ ఎస్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడీ సరికొత్త రాజకీయాలు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇటీవల టీఆర్ ఎస్ ప్రకటించిన 105మంది అభ్యర్థుల జాబితాలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే..  ఇందులో ఆదినుంచి వివాదాస్పదంగా ఉన్న చొప్పదండి ఎమ్మెల్యే బొడిగ శోభకు టికెట్ ఇవ్వకపోవడంపై అందరూ ఏమీ అనకున్నా.. పాపం ఎంపీ బాల్క సుమన్ కోసం ప్రజల్లో ఆదరణ ఉన్న చెన్నూర్ తాజా మాజీ ఎమ్మెల్యే  నల్లాల ఓదెలును పక్కకు పెట్టడం టీఆర్ఎస్ లో అందరినీ కలిచివేసింది. ఓదెలు తెలంగాణ ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ లోనే ఉంటూ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి సిన్సియర్ నేతను బాల్క సుమన్ కోసం పక్కనపెట్టడాన్ని అందరూ తప్పు పడుతున్నారు.

టీఆర్ ఎస్ కోసం ఎంతో చేసిన తనకు టికెట్ నిరాకరించడంపై తాజాగా నల్లాల ఓదెలు మనస్థాపం చెందారు. మంచిర్యాల జిల్లా మందమర్రి జోన్ లోని తన నివాసంలో స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. ఆయనతో పాటు భార్య భాగ్యలక్ష్మి - కుమారుడు సందీప్ - కుమార్తె జ్యోత్య్స - తల్లి పోషవ్వ సైతం ఇంట్లోంచి బయటకు రావడం లేదు. తనకు టికెట్ పై స్పష్టమైన హామీ లభిస్తేనే తాను గృహ నిర్బంధం నుంచి బయటకు వస్తానని నల్లాల ఓదెలు భీష్మించుకు కూర్చున్నారు. స్థానిక నేతలు, కార్యకర్తలు ఎంత ప్రాధేయపడ్డా ఆయన వినడం లేదు.

తనకు కేసీఆరే దేవుడని.. ఎంపీ బాల్క సుమన్ వల్లే తనకు టికెట్ రాలేదని నల్లాల ఓదెలు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టికెట్ ఇచ్చే వరకూ గృహ నిర్బంధం నుంచి బయటకు రానని ఆయన స్పష్టం చేశారు.
Tags:    

Similar News