ఈ నలుగురిలో ఎవరు మన కొత్త రాష్ట్రప‌తి

Update: 2017-02-27 04:27 GMT
భారత రాష్ట్రపతి ఎన్నికపై బీజేపీలో చర్చకు తెరలేచింది. పార్టీ సీనియర్ నాయకుడు మురళీమనోహర్ జోషి - విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పేర్లు ఈ పదవికి ప్రముఖంగా వినబడుతున్నాయి. వీరితోపాటు లోక్‌ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ - జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం. ఆసక్తికరంగా... ఒకప్పుడు మోడీకి విపరీతంగా మద్దతు పలికిన సీనియర్ నేత ఎల్‌ కే అద్వానీ పేరు పరిగణనలోకి రాకపోవడం గమనార్హం. జులైలో భారత రాష్ట్రపతి పదవి ఖాళీ కానుంది. బీజేపీ-ఆర్‌ ఎస్‌ ఎస్‌ ల చర్చల్లో ఈ పేర్లు తెరపైకి వచ్చినా.. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తరువాతే నిర్ణయం తీసుకుంటారు. ఆయా నేత‌ల ప్ర‌త్యేక అంశాలు ఇవి.

మురళీమనోహర్ జోషి

జోషీకి 1944 నుంచి ఆర్‌ ఎస్‌ ఎస్‌ తో అనుబంధం ఉంది. అప్పటికి ఆయన వయసు పదేళ్ల‌. అయోధ్యలో రామ మందిరం కోసం ప్రచారం జరుగుతున్నపుడు 1991లో ఆయన బీజేపీకి అధ్యక్షుడయ్యారు. అటల్ బిహారి వాజ్‌ పేయి నేతృత్వంలోని ప్రభుత్వాల్లో 1996 - 1998 -1999లో ఆయన కేంద్రమంత్రిగా పనిచేశారు. 1992లో కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు ఏక్తా యాత్ర నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం నాడు లాల్‌ చౌక్‌ లో జాతీయ జెండా ఎగురవేసి దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు. అయోధ్య ఉద్యమంలో జోషి చురుకైన పాత్ర పోషించారు. 1992 డిసెంబర్‌ లో బాబ్రీ మస్జీద్ ఘటన తర్వాత అరెస్టయ్యారు. 1975 జూన్‌లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలన విధించినపుడు నిరసన తెలిపినందుకు 19 నెలలు జైలుశిక్ష అనుభవించారు. జోషికి ఇప్పుడు 83 ఏళ్లు.

సుష్మాస్వరాజ్

రాష్ట్రపతి పదవికి సుష్మాస్వరాజ్ పేరు చర్చకు రావడానికి రెండు ప్రధాన కారణాలు. మోడీ ప్రభుత్వంలో ఆమె పనితీరు బాగుండడం, రెండోది ఈమె రాష్ట్రపతిగా ఎన్నికైతే.. మహిళలపై ఆర్‌ ఎస్‌ ఎస్ వివక్ష చూపుతుందన్న అపవాదును తొలగించినట్లవుతుంది. చాలామంది రాజకీయ నాయకులతో ఆమెకు సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఆమె ఆరోగ్యమే ఆందోళనపరిచే అంశం. ఈ పదవికి ఆమె ఎన్నికైతే, ఆమెకు చాలినంత విశ్రాంతి దొరుకుతుందని సమాచారం. ప్రస్తుతం సుష్మాస్వరాజ్ వయసు 65 సంవత్సరాలు.

సుమిత్రా మహాజన్

లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పేరూ రాష్ట్రపతి పదవికి ప్రస్తావనకు వచ్చింది. ఇండోర్ నుంచి ఈమె ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈమెకు కూడా ఆర్‌ ఎస్‌ ఎస్‌ తో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈమెకు 74 ఏళ్లు.

ద్రౌపది ముర్ము

జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఒడిశాకు చెందిన ఈ గిరిజన మహిళ 20 ఏళ్ల‌ పాటు రాజకీయ, సామాజిక సేవల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1997లో ఆమె రాజకీయాల్లో ప్రవేశించి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం ఒడిశా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఉత్తమ ఎమ్మెల్యేగా కూడా ఆమె అవార్డు అందుకున్నారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి కీలకపాత్ర పోషించారు. ఇప్పటివరకు ఏ గిరిజన వ్యక్తి కూడా రాష్ట్రపతిగా ఎన్నిక కాలేదు. ఒకవేళ ఈమె ఈ పదవికి ఎన్నికైతే రాష్ట్రపతిగా ఎన్నికైన గిరిజన మహిళగా చరిత్ర సృష్టిస్తారు. ముర్ము వయసు 59 ఏళ్లు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News