కాల్పుల‌పై బాల‌య్య విచారం...పీఏపై చ‌ర్య‌లు

Update: 2017-02-28 14:39 GMT
అగ్ర‌రాజ్యం అమెరికాలో తెలుగు వారిపై దాడులు జ‌ర‌గ‌డంపై నటుడు, తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విచారం వ్య‌క్తం చేశారు. కాన్సాస్ సిటీలో జ‌రిగిన కాల్పుల్లో శ్రీనివాస్ కూచిభొట్ల మృతి చెందడం దురదృష్టకరమని బాల‌కృష్ణ‌ అన్నారు. అమెరికాలో భ‌ద్ర‌త విష‌యంలో ఆ దేశ పాల‌కులు త‌గు నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జ‌రుగుతున్న సంద‌ర్భంగా  అమరావతికి వెళ్లిన బాల‌య్య ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు.

నవ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమరావతిలో తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జ‌ర‌గ‌డం చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తోందని బాల‌కృష్ణ‌ వ్యాఖ్యానించారు. బ‌డ్జెట్ స‌మావేశాలు చాలా కీల‌క‌మైన‌వ‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌భావ‌వంత‌మైన చ‌ర్చ జ‌రుగుతుంద‌ని అబిప్రాయ‌ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన హిందూపురం విభేదాలపైనా బాల‌య్య‌ స్పందించారు. హిందూపురంలో నెల‌కొన్న చిన్న చిన్న వివాదాలు స‌మ‌సిపోయాయ‌ని అన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వారిని తిరిగి తీసుకుంటామని, వారి పైన వేటు ఎత్తివేస్తామని చెప్పారు.
 
మ‌రోవైపు హైద‌రాబాద్‌లోని హోట‌ల్ ద‌స్‌ప‌ల్లాలో త‌న పీఏ వ‌ల్ల క‌లిగిన పేచీని సెట్ చేసేందుకు బాల‌య్య రంగంలోకి దిగిన‌ట్లు స‌మాచారం. పీఏ శేఖ‌ర్ పై ఫిర్యాదు చేసిన వారితో పాటు మిగ‌తా నేత‌లంద‌రినీ బాల‌య్య ఈ భేటీకి పిలిచార‌ని చెప్తున్నారు. అంద‌రినీ త‌మ మ‌న‌సులోని ఉన్న‌ది మాట్లాడాల‌ని బాల‌కృష్ణ కోరగా దాదాపు మెజార్టీ నేత‌లు పీఏ శేఖ‌ర్‌ పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శేఖ‌ర్ ఆగ‌డాల వ‌ల్ల ఎమ్మెల్యే గా ఉన్న మీకు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని కూడా బాల‌య్య‌తో స‌ద‌రు నేత‌లు వ్యాఖ్యానించిన‌ట్లు స‌మాచారం. దీంతో నియోజ‌క‌వ‌ర్గం పై దృష్టిపెడ‌తాన‌ని బాల‌య్య వారికి హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే హిందూపురం నియోజ‌క‌వ‌ర్గ స‌మావేశం ఏర్పాటు చేసి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు, అంద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త కుదిర్చేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని  ప్ర‌క‌టించిన‌ట్లు స‌మాచారం. అయితే హిందూపురం విష‌యంలో ఏదైనా తాను చెప్పిందే క‌రెక్ట్ అని బాల‌య్య హుకుం జారీచేసిన‌ట్లు తెలుస్తోంది. కాగా, పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడైన యువ‌నేత లోకేష్ ద్వారా ఈ బాధ్య‌త‌ల్లోకి పీఏ శేఖ‌ర్ వెళ్లిన‌ట్లు చెప్తున్నారు. అలాంటి వ్య‌క్తి ఇటు పార్టీకి, అటు బాల‌య్య‌కు మ‌చ్చ‌తెచ్చేలా వ్య‌వ‌హ‌రించార‌ని తెలుగు త‌మ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News