ఆ వైరస్ పై చైనా తాజా ప్రకటన.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో!

కొవిడ్ మహమ్మారి దెబ్బకు.. వైరస్ మాట విన్నంతనే ప్రపంచం ఉలిక్కిపడుతోంది.

Update: 2025-01-13 04:47 GMT

రష్యాలోని కమ్యూనిస్టులకు జలుబు చేస్తే.. ఢిల్లీలో ఉన్న కామ్రేడ్స్ లకు తమ్ములు వచ్చేవన్న ఎటకారం మాటలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంటాయి. ఇదెలా ఉన్నా.. చైనాలో ఏదైనా వైరస్ విరుచుకుపడుతుంటే.. యావత్ ప్రపంచం వణికిపోతోంది. కొవిడ్ మహమ్మారి దెబ్బకు.. వైరస్ మాట విన్నంతనే ప్రపంచం ఉలిక్కిపడుతోంది. ఇటీవల చైనాలో హ్యుమన్ మెటానిమోవైరస్ తీవ్రత ఎక్కువగా ఉందన్న మాటతో పాటు.. అక్కడ భారీగా నమోదు అవుతున్న కేసుల లెక్కలు భారత్ తో పాటు.. ప్రపంచంలోని పలు దేశాలు వణికిన పరిస్థితి.

అయితే.. సదరు వైరస్ కొత్తదేమీ కాదని.. ఇరవై ఒక్క ఏళ్ల క్రితమే వచ్చిందని.. దానికి అంతలా భయపడాల్సిన అవసరం లేదని.. దాన్ని జాగ్రత్తగా డీల్ చేస్తే.. పెద్ద ప్రమాదం లేదన్న విషయాలు బయటకు వచ్చాయి. అంతేకాదు.. ఈ వైరస్ కారణంగా మరణాల రేటు కూడా తక్కువగా ఉంటుందని నిపుణులు చెప్పటం.. అందుకు తగ్గట్లే మన దేశంలోని పరిస్థితులు ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ వైరస్ మీద చైనా ఆరోగ్య శాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు.తమ దేశంలోని ఉత్తర ప్రాంతంలో హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. నిర్దరణ పరీక్షలు అందుబాటులోకి రావటంతో గత కొన్నేళ్లుగా ఈ కేసుల సంఖ్య పెరిగిందన్న చైనా సీడీసీ పరిశోధకురాలు.. ‘‘కొన్నేళ్లుగా ఈ కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం పాజిటివ్ కేసుల రేటు హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఉత్తర చైనాలో ఈ రేటు తగ్గుతోంది. 14 ఏళ్లు.. అంతకంటే తక్కువ వయసులోని వారిలో పాజిటివ్ కేసుల రేటు తగ్గటం ప్రారంభమైంది’’ అంటూ గుడ్ న్యూస్ చెప్పారు. చైనా నుంచి వెలువడిన ప్రకటన.. ప్రపంచం ఊపిరి పీల్చుకోవటానికి అవకాశం ఇచ్చిందని చెప్పాలి.

Tags:    

Similar News