బాబులకు భలే మోజు : ఒకటి కాదు రెండుట...?

Update: 2022-06-10 16:30 GMT
తెలుగుదేశం పార్టీలో ఎన్నికల వేడి స్టార్ట్ అయిపోయింది. రెండేళ్ళ వ్యవధిలో ఎన్నికలు ఉన్నా తెల్లారిలేస్తే చాలు చాలా మంది ఆశావహులు టీడీపీ తమ్ముళ్ళు  అధినాయకుల చుట్టూ తిరుగుతున్నారు. టికెట్ కొరకు  గట్టి హామీ పొందాలని చూస్తున్నారు. దానికి తోడు ఏ మీటింగులో మాట్లాడినా చంద్రబాబు ఎన్నికలు తొందరలోనే ఉన్నాయని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఎన్నికల సందడి అయితే టీడీపీలో స్టార్ట్ అయిపోయింది.

ఇదిలా ఉండగా టీడీపీలో ఇపుడు బాబులిద్దరి గురించి కూడా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అధినేత చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న దాని మీద కూడా కొత్త ఆలోచనలు సాగుతున్నాయి. కుప్పం అన్నది బాబుకు పర్మనెంట్ సీటు. ఆయన అక్కడ నుంచి 1989 లో పోటీ మొదలుపెట్టి ఇప్పటికి ఏడుసార్లు గెలిచారు. అలాగే వచ్చే ఎన్నికల్లో కూడా అక్కడ నుంచే పోటీ చేస్తారు అని అంటున్నారు.

అయితే ఈసారి చంద్రబాబు రెండవ సీటు మీద కూడా చూపు సారించారు అని అంటున్నారు. ఆ రెండవ సీటు ఉత్తర కోస్తా జిల్లాలలో ఏదో ఒకటి ఉండొచ్చు అని అంటున్నారు. మరి బాబు కుప్పం నుంచి పోటీ చేస్తూ రెండవ దాని మీద ఎందుకు చూపు అంటే కుప్పంలో డౌట్ లేకపోయినా టఫ్ ఫైట్ సాగుతుంది అన్న చర్చ అయితే ఉంది. అక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుని కుమారుడు వైసీపీ తరఫున  పోటీ చేస్తారు అని అంటున్నారు. దాంతో వైసీపీ ఫుల్ ఫోకస్ పెడుతుంది.

ఇక మెజారిటీ తగ్గించినా కూడా గెలుపు అన్నది బాబుకే సొంతం అవుతుంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఏది జరిగినా కూడా బాబు రెండవ సీటులో కూడా పోటీ చేయడం ద్వారా సేఫ్ జోన్ లో ఉండేలా చూసుకుంటారు అని అంటున్నారు. అలాగే ఉత్తర కోస్తా జిల్లాలో తాను స్వయంగా బరిలోకి దిగడం ద్వారా పార్టీకి  బలమైన ఊపు తీసుకురావచ్చు అన్న వ్యూహాన్ని అమలు చేస్తారని అంటున్నారు. దాంతో సరైన సీటు కోసం అన్వేషణ సాగుతోంది అని ప్రచారం సాగుతోంది.

ఇక చినబాబు లోకేష్ కూడా రెండు అంటున్నారుట. ఆయన మంగళగిరి నుంచి పోటీ చేయడం దాదాపుగా కన్ఫర్మ్. అయితే మంగళగిరితో పాటు ఉత్తరాంధ్రా జిల్లాలలో చిట్టచివరి సీటుగా ఉన్న ఇచ్చాపురం నుంచి బరిలో ఉంటారు అని తెలుస్తోంది. ఇచ్చాపురంలో టీడీపీకి మంచి బలం ఉంది. ఎక్కువ సార్లు అక్కడ పార్టీ గెలిచింది. అక్కడ కమ్మ సామాజికవర్గం నుంచి ఎంవీ క్రిష్ణారావు నాలుగు సార్లు గెలిచారు.

దాంతో పాటు పార్టీ పెట్టాక ఇప్పటికి తొమ్మిదిసార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి 2004లో  కాంగ్రెస్ తప్ప మిగిలిన అన్ని సార్లూ టీడీపీ గెలుచుకుంది. అలా టీడీపీకి కంచుకోట. 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ లో కూడా బెందాళం అశోక్  గెలిచారు. ఆ మధ్య రాజాం టూర్ కి లోకేష్ వచ్చినపుడు ఇచ్చాపురంలో ఆయన పోటీ చేయాలని క్యాడర్ కోరినట్లుగా తెలుస్తోంది.

లోకేష్ పోటీలో ఉంటే ఉత్తరాంధ్రా జిల్లాలు మొత్తం టర్న్ అవుతాయని టీడీపీ వ్యూహ రచన చేస్తోంది. ఇక్కడ  ఉన్న మొత్తం 34 సీట్లలో మెజారిటీ గెలుచుకుంటే రేపటి రోజున సర్కార్ ఏర్పాటు చేయడం సులువు అవుతుంది అంటున్నారు. మొత్తానికి చూస్తే పెదబాబు, చినబాబు ఇపుడు ఒకటి కాదు రెండు అంటున్నారు. మరి అది ఉత్తిత్తి ప్రచారంగానే మిగిలిపోతుందా లేక నిజం చేస్తారా అంటే వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News