చంద్ర స్టయిల్ :అక్కడేం చేయరు..ఇక్కడైతే చేసేస్తార్ట!

Update: 2018-01-04 17:30 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు. ఎంత పోరాటపటిమను కనపరుస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రంనుంచి హక్కుగా రావాల్సిన వాటిని పోరాడి అయినా సాధించుకోవడానికి ఆయన ఏం ప్లాన్ చేస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలకు మనకు ఎన్నడూ సమాధానం దొరకదు. కేంద్రంలోని భాజపాతో సాధించుకోవాల్సిన ప్రత్యేకహోదా వంటి వాటిని ఆయన ఎంచక్కా గాలికొదిలేసి.. రాష్ట్రానికి జన్మజన్మలకూ తీరని ద్రోహం చేశారని ప్రజలు అనుకుంటూ ఉంటారు. అదే సమయంలో రాష్ట్రం కోసం జగన్ నిరాహార దీక్షలుచేస్తే.. ఇక్కడెందుకు ఢిల్లీకెళ్లి చేయరాదా? అంటూ ఎద్దేవా చేస్తారు. ఢిల్లీకి వెళ్లి దీక్ష చేస్తే పని జరుగుతుందనే నమ్మకం ఉంటే చంద్రబాబే ఢిల్లీలో నిరాహార దీక్ష చేసి ప్రత్యేకహోదా సాధించవచ్చు కదా...! ఇలాంటి అయిడియా ప్రతి సామాన్యుడికి వస్తున్నది గానీ.. చంద్రబాబుకు మాత్రం రావడం లేదు. రాష్ట్రానికి రాగల అసలు ప్రయోజనాల కోసం దీక్ష చేయడం పట్టించుకోరు గానీ.. తాజాగా మరుగుదొడ్లు నిర్మించడం కోసం కలెక్టర్ల ఎదుట నిరాహార దీక్ష చేస్తానని రాష్ట్రాధినేత ప్రకటించడం చాలా చిత్రంగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.

జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటూ చంద్రబాబునాయుడు స్వచ్ఛ భారత్ గురించి, ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణం గురించి లక్ష్యాలను ప్రవచించారు. మరుగుదొడ్డి లేని ఇల్లు అనేదే లేకుండా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని పిలుపు ఇచ్చారు. ఇప్పటికి ఆరు జిల్లాల్లో లక్ష్యాలు సాధించామని అన్ని జిల్లాలు అలా తయారు కావాలని అన్నారు. అయితే చంద్రబాబు చేస్తున్న హెచ్చరిక ఏంటంటే.. కలెక్టర్లు మరుగుదొడ్లు కట్టే లక్ష్యంలో విఫలం అయితే గనుక.. తాను కలెక్టర్ల ఎదుట ఒకరోజు నిరాహారదీక్ష చేసి అయినా సాధిస్తానని చంద్రబాబు హెచ్చరించారు. విభజన కష్టాలనుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి రాత్రీ పగలూ లేకుండా కష్టపడుతున్నానని ఎప్పటిలాగానే తన గురించి టముకు వేసుకున్న చంద్రబాబు.. మార్చి 31 లోగా మరుగుదొడ్లన్నీ పూర్తయిపోవాలని కలెక్టర్లకు డెడ్ లైన్ ఇచ్చేశారు.

అయితే ఇక్కడ గమనార్హమైన విషయం ఏంటంటే.. సాధారణంగా మనకంటె పైస్థాయిలో ఉన్న వారినుంచి మనకు అవసరమైన డిమాండ్లను సాధించుకోవడానికి, వారు ఒప్పుకోకుంటే ఉద్యమించడానికి నిరాహారదీక్షను ఎవరైనా ఆశ్రయిస్తారు. అయితే.. తన కింద ఉద్యోగులుగా పనిచేసే కలెక్టర్లు పనిచేయకపోతే.. దీక్ష చేస్తాననే ప్రభుత్వాధినేత మాటలు విని ప్రజలే విస్తుపోతున్నారు. నిజంగా నిరాహారదీక్షపై చంద్రబాబుకు మోజు ఉంటే.. ఢిల్లీలో చేస్తే ప్రత్యేక హోదానే వస్తుంది కదా.. చేయాల్సిన చోట ఏమీ చేయరు గానీ.. జిల్లాల్లో చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారంటూ జనం అనుకుంటున్నారు. కేంద్రంతో సంయమనంతో సాధించాలి అనే చంద్రబాబు.. జిల్లా కలెక్టర్లతో సంయమనంతో పనులు జరిపించలేరా? అని జనం నవ్వుకుంటున్నారు.

Tags:    

Similar News