బీజేపీ బాదుడు మీద నిరసన లేదా బాబూ..?

Update: 2022-04-14 01:30 GMT
ఏపీలో బీజేపీ అదృష్టం ఏంటో కానీ ఒక్క కామ్రెడ్స్ తప్ప అందరూ అసలు ఏమీ  అనరు, అనలేరు. అధికార వైసీపీ కేంద్రంతో సయోధ్యకు చూస్తోంది. దాంతో బీజేపీ విషయంలో పెద్దగా రియాక్ట్ కాదు. ఇక విపక్షం వైసీపీ సర్కార్ మీద ఒంటి కాలు మీద లేస్తుంది. కానీ కేంద్ర విధానాల మీద ఫుల్ సైలెంట్.

ఇది నిజంగా ఆశ్చర్యమే. పెట్రోల్ డీజిల్ బాదుడుతో మొదలెట్టి వంటింట్లో కూడా వంట గ్యాస్ రేటు పెంచి సామాన్యుడి నట్టింట కుంపటి పెట్టేసింది బీజేపీ. అంతేనా డైలీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతోంది. మరి దీని మీద చూస్తే పొరుగు రాష్ట్రం తెలంగాణాలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కూడా ధర్నాలో పాల్గొన్నారు. మరి ఏపీ సంగతి చూస్తే జగన్ మీద బాదుడే బాదుడు అంటూ చంద్రబాబు, చినబాబు ప్రతీ రోజూ గట్టిగా సౌండ్ చేస్తున్నారు. కాదేదీ బాదుడుకు అనర్హం అని లోకేష్ మహా కవి శ్రీశ్రీని కూడా గుర్తుకు తెచ్చి సెటైర్లు వేశారు. ఇది బాగానే ఉంది.  గట్టిగా అనాల్సిందే. ప్రజల పక్షాన పోరాడాల్సిందే.

అదే టైమ్ లో బీజేపీ బాదుడు మీద కూడా పెదవి విప్పాలి కదా. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ తీరు కూడా ఇలాగే ఉంది. బీజేపీని పల్లెత్తు మాట అనకుండా ఏపీలో కరెంట్ చార్జీల మీద ఆందోళనలతో సరిపెడుతున్నారు. మరి కరెంట్ చార్జీలు ఎంత భారమో దానికి మించి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కూడా పెను భారమే.

ఇంధన ధరలు పెంచడం వల్ల రవాణా రంగం మీద దాని ప్రభావం పడి మొత్తం మార్కెట్ నే హీటెక్కిస్తుంది. నిత్యావసరాల నుంచి, కూరగాయల వరకూ ఏం కొనేటట్టు లేదు అన్నట్లుగా పరిస్థితి ఉందంటే ఇంధన ధరల పెంపు వల్లనే. వంట గ్యాస్ అచ్చంగా వేయి రూపాయలకు చేరువ అయింది.

మోడీ సర్కార్ కేంద్రంలో అధికారంలోకి వచ్చినపుడు నాలుగు వందల  దాకా ఉండేది. అంటే ఎనిమిదేళ్ళలో ఆరు వందల రూపాయలు పెరిగింది అన్న మాట. మరి ఇంత దారుణంగా పెంచుకుంటూ పోతే బీజేపీని నిలదీయాల్సిన విపక్షాలు ఫుల్ సైలెంట్ గా ఉండడమేంటి అని వామపక్షాలే ప్రశ్నిస్తున్నాయి.

దీని మీద సీపీఐ రామక్రిష్ణ అయితే పవన్, చంద్రబాబు బీజేపీ మీద కూడా తమ పోరాటాన్ని చేస్తేనే అది పూర్తి స్థాయిలో  జనాలకు న్యాయం చేసినట్లు అవుతుంది అని సూచిస్తున్నారు. ఏపీలో వామపక్షాలు గత కొన్ని రోజులుగా గ్యాస్ బండను వేసుకుని ఆందోళన‌ను చేస్తున్నారు. అలాగే పెట్రోల్ డీజిల్ చార్జీలు తగ్గించాలని కూడా కోరుతున్నారు.

మరి ఏపీలో బాదుడే బాదుడు ప్రోగ్రాం పెట్టి మరీ జగన్ మీద టీడీపీ గన్ గురి పెట్టింది. ఈ బాదుడే బాదుడులో బీజేపీని ఎందుకు చేర్చలేదు బాబుగారూ అని సగటు జనాలు అడిగితే జవాబు ఉందా. ఇంధన ధరలు మాకు చాలా బాగున్నాయి అని సగటు జనం ఏమైనా టీడీపీకి చెప్పిందా లేక పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే మాకేంటి అని టీడీపీ వారు వదిలేశారా అన్నది తెలియడం లేదంటున్నారు.మొత్తానికి చూస్తే ఇలాంటి వన్ సైడ్ ఆందోళనలు చేస్తేనే జనాలకు పార్టీల మీద నమ్మకం పోతుంది. చేసిందేదో ప్రజల పక్షం వహించి వారూ వీరూ చూడకుండా చెడుగుడు ఆడితేనే వారు ప్రతిపక్షంలో ఉన్నట్లు. ప్రజల పక్షం గా ఉన్నట్లు. లాజిక్ ఇంతేగా మరి.
Tags:    

Similar News