ఐరన్ లెగ్ అనాల్సింది మీరు కాదు బాబు?

Update: 2022-05-06 06:25 GMT
రాజకీయ ప్రత్యర్థిపై విరుచుకుపడే వేళ.. మొత్తం ప్రసంగానికి హైలెట్ అన్న మాట ఒకటి ఉంటుంది. ఆ అంశాన్నే అందరూ చర్చించుకుంటారు. అలాంటి కీ పాయింట్ లో ఎలాంటి లోపం లేకుండా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నోటి నుంచి మాత్రం ఇందుకు భిన్నమైన మాటలు రావటం గమనార్హం.

తాజాగా ఆయన విశాఖపట్నం పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డిది ఐరన్ లెగ్ అని పేర్కొని సంచలంగా మారారు. ఒక సీఎంను ఐరెన్ లెగ్ అనటం ఓకే. ఎందుకంటే.. చంద్రబాబును అలాంటి మాటలు ఎన్నో అన్నారు. ఆ లెక్కన చూస్తే.. జగన్ ది ఐరెన్ లెగ్ అన్నప్పుడు.. దానికి బలమైన కారణం చూపించి.. అవును కదా? చంద్రబాబు నిజమే చెప్పారు.. మనకింతవరకు తట్టలేదని సగటు ప్రజలు అనుకోవాలి.

అంతేకానీ.. అన్న మాటకు ఎలాంటి జస్టిఫికేషన్ లేకపోతే మొదటికే మోసం రావటం ఖాయం. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు చంద్రబాబు. ఎందుకంటే.. జగన్ ది ఐరెన్ లెగ్ అన్నప్పుడు.. దానికి బాబు చూపించిన కారణం.. అధిక అప్పులు. ఆ మాటకు వస్తే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు సైతం ఐదేళ్లలో ఎంతటి అప్పు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐరెన్ లెగ్ కు ప్రామాణికం .. అప్పులు చేయటమేనా? అదే నిజమైతే బాబు హయాంలో చేసిన అప్పులు.. ఆయన్ను కూడా ఐరెన్ లెగ్ అనాలా? అన్నది ప్రశ్న.

ఇలా సంబంధం లేకుండా మాట్లాడే మాటలు తన ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తుందన్న విషయాన్ని చంద్రబాబు ఎందుకు గుర్తించటం లేదు? మిగిలిన విషయాలు ఎలా ఉన్నా జగన్ సర్కారు విద్యా విధానం అందరిని ఆకర్షిస్తోంది. గతంలో ఎప్పుడూ.. ఏ ప్రభుత్వంలో లేని రీతిలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారటం.. అక్కడ అమలు చేస్తున్న డైట్ విధానం.. ఇస్తున్న గుడ్లు.. చెక్కీలు.. పుస్తకాలు.. బ్యాగులు.. ఇలా ఏ ఒక్కటి వంక పెట్టేదిగా లేదు. అలాంటప్పుడు ఆ విషయాల్ని ప్రస్తావించటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.

ఇంగ్లిషు మీడియం అని చెప్పి కొండ నాలుక్కి మందు వేస్తే ఉన్న నాలుక పోయిందన్న చందంగా పరిస్థితి మారిందని చంద్రబాబు నోటి నుంచి వచ్చే మాటలకు కౌంటర్లు వేయటానికి సిద్ధంగా ఉండేవారెందరో. అందుకే.. విమర్శలు చేయాలి.. సూటిగా తగిలేలా? ప్రత్యర్థుల నోటి నుంచి సమాధానాలు కరవు అయ్యేలా ఉండాలే తప్పించి.. నువ్వు ఒకటి చెబితే నేను రెండు కౌంటర్లు ఇస్తానన్నట్లుగా ఉంటే ప్రయోజనం ఉండదు.

సీఎం జగన్ ను ఉద్దేశించి..ఆయన పాలనను వేలెత్తి చూపించేందుకు బోలెడన్ని అంశాలు ఉన్నాయి. వాటిల్లో ప్రజలకు ఈజీగా కనెక్టు అయ్యే కొన్ని అంశాల్ని టేకప్ చేసి.. వాటిని మాత్రమే ప్రస్తావించటం ద్వారా ఉపయోగం ఉంటుందే తప్పించి.. రొడ్డ కొట్టుడు మాటలతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని చంద్రబాబు అండ్ కో ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. లేదంటే ఐరెన్ లెగ్ అన్న చంద్రబాబు మాటకు ఎలా అయితే ఎఫెక్టు రాలేదో.. మిగిలిన వాటి పరిస్థితి అలానే ఉంటుంది. అయినా.. జగన్ ను మాట అనాల్సింది చంద్రబాబు కాదు.. ప్రజలు. అంటే.. ప్రజలు అనుకునేలా చంద్రబాబు చేయాలి. అంతేకానీ తనకు తాను అనుకోకూడదన్న అసలు విషయాన్ని తెలుగు తమ్ముళ్లు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.
Tags:    

Similar News