జ‌గ‌న్ బ‌లాన్ని ఒప్పేసుకున్న చిన‌బాబు

Update: 2018-07-13 08:32 GMT
ఆ ఏముంది.. సింఫుల్ గా ఓడించేస్తాం అంటే అదో ధీమా. అందులో నిజం సంగ‌తి ఎలా ఉన్నా.. ఒక‌లాంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాస్త‌వం ఏమిట‌న్న విష‌యం నాయ‌కుడికి తెలిసినా.. మీకెందుకు నేనున్నా అన్న‌ట్లుగా చెప్పే మాట‌లు  కొత్త స్ఫూర్తిని నింప‌ట‌మే కాదు.. పోరాట ప‌టిమ‌ను మ‌రింత పెంచుతాయి. అందుకు భిన్నంగా.. మ‌నం జాగ్ర‌త్త‌గా ఉండాలి.. ప్ర‌త్య‌ర్థి బ‌లం భారీగా ఉంద‌న్న మాట‌లు వ‌స్తే నీరుగారిపోతారు.

శ‌త్రువు బ‌లాన్ని చెప్పాలే కానీ.. దాన్ని తామెలా ఎదుర్కొంటామ‌న్న విష‌యాన్ని చెప్ప‌గ‌లిగిన‌ప్పుడు మాత్ర‌మే ప్ర‌స్తావించాలి. కానీ.. అంత ముందుచూపుతో మాట్లాడటం ఏపీ మంత్రి లోకేశ్‌ కు కాస్త ఇబ్బంది క‌లిగించే విష‌య‌మే.  తాజాగా త‌న మాట‌ల‌తో త‌మ్ముళ్ల‌ను భ‌య‌ప‌డేలా చేశారు. రానున్న ఎన్నిక‌ల్లో 175 సీట్లు త‌మ‌వే అన్న బ‌డాయి మాట‌ను చెబుతూనే మ‌రోవైపు ప్ర‌త్య‌ర్థి బ‌లం గురించి చిన‌బాబు చెప్పిన మాట త‌మ్ముళ్ల‌లో కొత్త గుబుల‌కు కార‌ణ‌మైంది.

తిరుగులేని అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ట్లు చెబుతున్న‌చిన‌బాబు.. అవే త‌మ‌ను గెలిపిస్తాయ‌ని.. చివ‌ర‌కు పులివెందుల‌లో కూడా గెలుస్తామ‌న్న అత్యాశ మాట‌లు మాట్లాడుతున్నారు. ప్ర‌త్య‌ర్థులు దుర్మార్గులు కావ‌టంతో ప్ర‌జ‌లు త‌మ‌ను ఓట్ల‌తో ముంచెత్తుతార‌ని.. రాబోయే ఎన్నిక‌ల్లో విజ‌యం ప‌క్కా అని.. గెలుపు ధీమాను ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

అధికార పార్టీలో కీల‌క నేత‌గా ఆ మాత్రం ధీమాను వ్య‌క్తం చేయ‌క‌పోతే బాగోదు. చిక్కంతా ఎక్క‌డంటే.. ఆ ధీమాను కొన‌సాగించే క్ర‌మంలో లోకేశ్ నోటి నుంచి వ‌చ్చిన మాట‌లే ఇబ్బందిక‌రంగా మారాయి.

రాష్ట్రంలోని మొత్తం 175 సీట్ల‌ను సాధించ‌ట‌మే అత్యాశ ల‌క్ష్యాన్ని నేత‌ల ముందు పెట్టిన లోకేశ్‌.. ఐదు వేల ఓట్ల మెజార్టీతో ఉండే నియోజ‌క‌వ‌ర్గాలు అత్య‌ధికంగా ఉన్నాయ‌న్న అస‌లు మాట‌ను కూడా చెప్పారు. అంత‌కు ముందు వ‌ర‌కూ గెలుపు మీద మ‌హా ధీమాను ప్ర‌ద‌ర్శించిన లోకేశ్‌.. ఐదు వేల ఓట్ల మెజార్టీతో ఫ‌లితం మారిపోయే నియోజ‌క‌వ‌ర్గాలు చాలానే ఉన్నాయ‌న్న మాట‌తోనే ప్ర‌త్య‌ర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బ‌లం ఎంత‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మవుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఐదు వేల ఓట్ల తేడాతో ఫ‌లితం మారిపోయే వీలున్న నియోజ‌క‌వ‌ర్గాలు చాలానే ఉన్న నేప‌థ్యంలో బూత్ స్థాయి నాయ‌కులంతా క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాల‌ని.. ఓట్లు అన్ని త‌మ‌కే ప‌డేలా చేయాల‌న్న మాట‌ను ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ మాట‌లు చాలు ఏపీలో జ‌గ‌న్ బ‌లం ఎంత‌న్న‌ది తేలిన‌ట్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అప్ప‌టివ‌ర‌కూ గెలుపుపై మాట‌లు చెప్పిన లోకేశ్‌.. అంత‌లోనే ఐదు వేల ఓట్ల లెక్క‌తో తుస్ అనిపించార‌న్న మాట త‌మ్ముళ్లలో వినిపిస్తోంది.ఐదు వేల ఓట్ల మాట తెలుగు త‌మ్ముళ్ల‌లో కొత్త భ‌యాన్ని క‌లిగిస్తున్న‌ట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News