య‌న‌మ‌ల‌కు లోకేశ్ ఎర్త్ పెట్టేశారే!

Update: 2017-09-27 12:00 GMT
య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు... టీడీపీలో సీనియ‌ర్ మోస్ట్ నేత‌గా పేరున్న నేత‌. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వ‌చ్చినా... ఆ పార్టీ ప్ర‌భుత్వానికి సంబంధించిన కేబినెట్‌ లో ఆయ‌న‌కు ఓ కీల‌క‌మైన బెర్త్ ఖాయ‌మే. పార్టీ అవిర్భావం నుంచీ టీడీపీలో కొన‌సాగుతున్న య‌న‌మ‌ల... త‌న సొంత జిల్లా తూర్పుగోదావ‌రిలో త‌న‌కంటూ ఓ వ‌ర్గాన్ని ఏర్పాటు చేసుకోవ‌డంపై అంత‌గా దృష్టి సారించ‌డం లేద‌నే చెప్పాలి. రాష్ట్ర స్థాయిలో చ‌క్రం తిప్పుతున్న త‌న‌కు జిల్లాలో వ‌ర్గం ఎందుక‌నుకున్నారో - ఏమో తెలియ‌దు గానీ... జిల్లా రాజ‌కీయాల‌పై య‌న‌మ‌ల అంత‌గా దృష్టి సారించ‌లేద‌నే అభిప్రాయం లేక‌పోలేదు. పార్టీలో పాత ర‌క్తం పోయి ఇప్పుడు కొత్త ర‌క్తం వ‌చ్చేసింది. పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీ రామారావును కాద‌ని - ఆయ‌న చేతిలోని పార్టీని లాగేసుకున్న నారా చంద్ర‌బాబునాయుడు... పార్టీకి హోల్ అండ్ సోల్‌ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌డ‌చిన 25 ఏళ్లుగా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది.

ఈ క్ర‌మంలో నాడు ఎన్టీఆర్‌ కు అత్యంత స‌న్నిహితంగా మెల‌గిన య‌న‌మ‌ల‌... ఆ త‌ర్వాత చంద్ర‌బాబుకు కూడా న‌మ్మ‌క‌స్తుడిగానే మారిపోయారు. ఫ‌లితంగా చంద్ర‌బాబు కేబినెట్‌ లో య‌న‌మ‌ల త‌ర్వాతే ఎవ‌రైనా అన్న అభిప్రాయం ఉంది. అయితే ప‌రిస్థితి అంతా మారిపోయింద‌నే చెప్పాలి. పార్టీలో మూడో  త‌రం నేత‌గా చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేశ్ పాలిటిక్స్‌ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. మ‌రి త‌రాలు మారుతున్న త‌రుణంలో పార్టీ ప్రాధ‌మ్యాలు కూడా మారిపోతూనే ఉంటాయి కదా. ఇందులో భాగంగానే సీనియ‌ర్ అయిన య‌న‌మ‌ల‌కు చెక్ ప‌డిపోయింద‌నే భావ‌నే వినిపిస్తోంది. ఆ విష‌యానికి సంబంధించిన పూర్తి వివ‌రాల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా యనమలకు ఆధిపత్యానికి పార్టీలో ప్రత్యర్థి వర్గం చెక్ పెడుతోంది. పార్టీ రాష్ట్ర కార్య‌వ‌ర్గంలో కీల‌క నేత హోదాలో ఉన్న‌ యనమల చెప్పినట్టుగానే గతంలో జిల్లాలో పార్టీ వ్యవహరాలు కొనసాగేవి. అయితే ఇటీవల కాలంలో మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హారం సాగుతోంద‌నే అభిప్రాయాలు పార్టీలో వినిపిస్తున్నాయి. యనమలకు చెక్ పెట్టేందుకు నారాలోకేష్‌ ద్వారా ప్రత్యర్థివర్గం పావులు కదుపుతోందనే ప్రచారం సాగుతోంది.

జిల్లాలో మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిన మాట ప్రకారంగానే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నడుచుకొంటారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. అయితే ఇటీవల కాలంలో చోటుచేసుకొన్న పరిణామాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయనే అభిప్రాయాలను పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నాయి. 2019 ఎన్నికలకు పార్టీ నాయకత్వం ఇప్పటి నుండే వ్యూహరచన చేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యర్థి పార్టీల నుండి బలమైన నేతలను తమ పార్టీలోకి ఆహ్వనిస్తోంది. ఈ తరుణంలోనే తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం యనమలకు చెక్ పెట్టేందుకు ఉన్న అవకాశాలను ప్రత్యర్థి వర్గం ఉపయోగించుకొంటోందని పార్టీలో ప్రచారం సాగుతోంది. వైసీపీ నుండి ఇటీవల పార్టీలోకి చేరిన జ్యోతుల నెహ్రుకు మంత్రి పదవి రాకుండా యనమల రామకృష్ణుడు అడ్డుకొన్నారనే ప్రచారం నెహ్రు వర్గీయుల్లో ఉంది. మంత్రి పదవిని అడ్డుకోవ‌డంతో పాటు అందివచ్చిన జ‌డ్పీ  చైర్మ‌న్ ప‌ద‌విని కూడా జ్యోతుల కుటుంబానికి ద‌క్క‌కుండా య‌న‌మ‌ల త‌న వంతుగా చేయాల్సిన‌దంతా చేశార‌ట‌.

అయితే పార్టీ అవసరాలరీత్యా జ్యోతుల కుటుంబానికి జడ్పీ  ఛైర్మెన్ పదవిని పార్టీ కట్టబెట్టింది. అప్పటివరకు జడ్పీ చైర్మ‌న్‌ గా ఉన్న వామన రాంబాబును రాజీనామా చేయించి మరీ జ్యోతుల నవీన్‌ కు జిల్లా పరిషత్ ఛైర్మెన్ పదవిని కట్టబెట్టింది పార్టీ అధిష్ఠానం. ఇక మొన్న జ‌రిగిన కాకినాడ కార్పోరేషన్ ఎన్నిక‌ల్లోనూ సుదీర్ఘ విరామం తర్వాత టీడీపీ విజ‌యం సాధించింది. అయితే మేయర్ పదవికి అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా యనమల రామకృష్ణుడుకు చుక్కెదురైందని ఆయన వర్గీయులు అభిప్రాయంతో ఉన్నారు. అధిష్టానం సీల్డ్‌ కవర్‌ రాజకీయంతో యనమలకు పెద్ద ఝలక్‌ ఇచ్చింది. ఎంపీ తోట నర్సింహం ఆధ్వర్యంలో యనమల ప్రత్యర్ధి నేతలంతా ఒక్కటై అధిష్టానం స్థాయిలో తమదే పైచేయి అనిపించుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. యనమల రామకృష్ణుడుకు చెక్ పెట్టేందుకు ప్రత్యర్థులంతా ఏకతాటిపైకి వచ్చారనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. అయితే జిల్లా కలెక్టర్‌ నియామకంతో పాటు ఓ డీఎస్పీ - అన్నవరం ఈఓ నియామకం విషయంలో కూడ యనమలకు వ్యతిరేకంగా ప్రత్యర్థులు పై చేయి సాధించారనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. జిల్లాలో ఇటీవల చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో యనమల వర్గీయులు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అంటే... జిల్లాలోనే కాకుండా రాష్ట్ర కార్య‌వ‌ర్గంలోనూ యన‌మ‌ల‌కు ఎర్త్ ప‌డిపోతోంద‌న్న మాట‌.
Tags:    

Similar News