లోకేష్ డౌట్ః న‌న్ను ఎమ్మెల్సీగానే ఉంచేస్తారా

Update: 2017-09-14 07:44 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు రాష్ట్ర ఐటీ - పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి వస్తోన్న ఆదాయంలో 42 శాతం ఉద్యోగుల జీతభత్యాలకు - పింఛన్లకే ఖర్చవుతోందని తెలిపారు. సంక్షేమం కోసం ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త ఇస్తోంద‌ని తెలిపారు. అందుకే ఉద్యోగుల‌పై పెద్ద బాధ్య‌త‌లే ఉన్నాయ‌న్నారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌తో లోకేష్ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. ``వచ్చే ఎన్నికల్లో నన్ను శాసనసభకు ఎన్నిక కావడం ద్వారా మంత్రిని చేస్తారా? శాసనమండలికే పరిమితం చేస్తారా? అనేది అధికారుల చేతుల్లోనే ఉంది. ఎన్నికలకు మరో 18 నెలలు మాత్రమే సమయం ఉంది. ఈలోపు ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కల్పించాల్సిన బాధ్యత అధికారులదే`` అని లోకేష్‌ అన్నారు.

సమీక్ష స‌మావేశం అనంత‌రం మంత్రి నారా లోకేష్ విలేకరుల‌ సమావేశంలో మట్లాడుతూ ప్రతిపక్ష వైసీపీపై ధ్వజమెత్తారు.నేడు రాష్ట్రంలో అనుభవం లేని అసమర్థ నేత ప్రతిపక్ష నేతగా ఉన్నాడని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అడ్డంకులు సృష్టించడమేనని ఆయన మండిపడ్డారు. అయితే ప్ర‌జ‌లు తెలుగుదేశం పార్టీకి అండ‌గా ఉన్నార‌ని వివ‌రించారు. ఇటీవల నంద్యాల ఉపఎన్నిక - కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయకేతనం ఎగురవేసిందన్నారు. 2019 నాటికి రాష్ట్రంలో అన్ని స్థానాలను భారీ మెజారిటీతో కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ‘ఇంటింటికీ తెలుగుదేశం’ చేపట్టామన్నారు.  ప్రజా సమస్యలను పరిష్కరించుకునేందుకు ఇదొక చక్కని అవకాశంగా మంత్రి లోకేష్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను ఆన్‌ లైన్‌ లో పొందుపరుస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ - మండల - జిల్లా - రాష్ట్ర స్థాయిలలో ఏయే కార్యక్రమాలు చేపట్టినదీ ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శిస్తామని వివరించారు.

కాగా, మూడు లక్షల ఐటి ఉద్యోగాల ప్రకటనపై మంత్రి లోకేష్‌ స్పందిస్తూ...మొత్తం మూడు లక్షల్లో లక్ష ఉద్యోగాలు ఐటి రంగం నుంచి - రెండు లక్షల ఉద్యోగాలు ఎలక్ట్రానిక్‌ రంగం నుంచి ఇస్తామని వివరించారు. ఇప్పటికే ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చామని, 2019 నాటికి ఈ సంఖ్య 22 వేలకు చేరుతుందన్నారు. 2018 నాటికి అన్ని గ్రామాల్లోనూ ఎల్‌ ఇడి లైట్లు ఏర్పాటు చేస్తామని, 2019 నాటికి వందశాతం సీసీ రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక్క బెల్డ్‌ షాపు కూడా లేదని, ఉన్నట్టు ఆధారాలు చూపిస్తే వెంటనే తొలగిస్తామని మంత్రి లోకేష్‌ చెప్పారు.
Tags:    

Similar News