బాబు వస్తే జాబు!!..మరి లోకేశ్ బాబు వస్తే?

Update: 2017-07-15 06:23 GMT
వినేవాడు వెర్రోడైతే ఇంగ్లీష్ లో హరికథ చెప్తానన్నాడట ఒకాయన. ఏపీ మంత్రి లోకేశ్ కూడా అలాగే ఇంగ్లీష్ లో హరికథలు చెప్పాలనుకున్నారు. కానీ.. కర్నూలు ప్రజలు అవేమీ వినలేదు సరికదా.. హరికథలు, వెధవ కథలు చెప్పకుండా వాస్తవాలు చెప్పాలని నిలదీశారు.
    
కర్నూలులో ఓ సభకు హాజరైన నారా లోకేష్‌ ను స్థానికులు నిలదీశారు.  ఎన్నికల సమయంలో ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు, జిల్లాలో పరిశ్రమలు స్థాపిస్తామని హామీ ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు ఎందుకు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని స్థానికులు లోకేష్‌ను వేదిక మీదే నిలదీశారు. దీంతో మైక్ అందుకున్న లోకేష్‌… జిల్లాలో పరిశ్రమలను స్థాపిస్తున్నామని చెప్పారు. అక్కడితో ఆగకుండా జిల్లాలో కియో మోటార్స్‌ కంపెనీ రావడంతో ఏకంగా ఐదు లక్షల ఉద్యోగాలు స్థానికులకే వచ్చాయని చెప్పేశారు.  దీంతో అక్కడున్నవారంతా... ఒక్కపెట్టున అడ్డం తగిలారు. 5లక్షల ఉద్యోగాలు కాదు.. కియోలో ఉద్యోగం వచ్చినవాడిని ఒక్కడినైనా చూపించండి చాలు అంటూ ప్రశ్నించారు. దీంతో లోకేశ్ వద్ద సమాధానం లేకుండా పోయింది.
    
దీంతో కర్నూలు టీడీపీ నేతలు  కేఈ ప్రభాకర్ - ఎస్వీ మోహన్‌ రెడ్డి తదితరులు స్థానికులు - ప్రజాసంఘాల నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో వారంతా...  జిల్లా అభివృద్ధి గురించి మీరు ఎలాగో ప్రశ్నించలేరు… నిలదీస్తున్న మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారని కౌంటర్ ఇచ్చారు.
    
అడ్డగోలుగా నోటికొచ్చిన లెక్కలు చెప్పి అవాస్తవాలు ప్రజల్లో ప్రచారం చేయాలనుకుంటే సహించబోమని అక్కడున్న ప్రజాసంఘాల నేతలు మండిపడ్డారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోయినా 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఎలా చెప్తారని వారు ప్రశ్నించారు. పాపం.. వాళ్ల ఎదురుదాడితో లోకేశ్ బిత్తరపోయాడట.
Tags:    

Similar News