మంగళగిరి ప్రజల చెవుల్లో పూలు పెడుతున్న లోకేష్!

Update: 2019-03-17 12:47 GMT
‘బొంకరా.. బొంకరా.. బోలిగా అంటే..టంగుటూరి మిరియాలు తాటికాయలంత..అన్నాడట వెనుకటికి ఒకడు..’ అనేది సామెత. ఇప్పుడు ఇది సరిగ్గా నారా లోకేష్ బాబుకు సూటవుతుందని అంటున్నారు పరిశీలకులు. అటు తిరిగి ఇటు తిరిగి మంగళగిరి నుంచి పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్న లోకేష్ బాబు…ఆ నియోజకవర్గం ప్రజల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.

తను అక్కడ పోటీ చేయడం ఆ ప్రాంత ప్రజల అదృష్టం అన్నట్టుగా ఉంది లోకేష్ బాబు ప్రచారం తీరు. అసలే తెలుగుదేశం పార్టీకి అంతంత మాత్రం పట్టున్న ఆ ప్రాంతంలో లోకేష్ గెలుస్తారా.. లేదా.. అనే అంశం మీద చర్చ సాగుతూ ఉంది. అయితే లోకేష్ మాటలు మాత్రం కోటలు దాటుతూ ఉన్నాయి. జనాలను వెర్రి వాళ్లుగా చేసేవిలా ఉన్నాయి లోకేష్ బాబు మాటలు.

తను మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయితే.. ఆ ప్రాంతాన్ని గచ్చిబౌళీగా మార్చేయడం ఖాయమని లోకేష్ ప్రచారం చేసుకుంటున్నాడు. హైదరాబాద్ లో గచ్చి బౌళీ ప్రాంతం ఏ స్థాయిలో ఐటీ డెవలప్ మెంట్ సాధించిందో.. ఆ రేంజల్లో మంగళగిరి ప్రాంతాన్ని మార్చేయడానికి రెడీ అని లోకేష్ ప్రకటించుకుంటున్నాడు. ఇదేదో అల్లాఉద్ధీన్ కథలా ఉంది. లోకేష్ మాటలు కల్లబొల్లి మాటల్లాగానే ఉన్నాయి.

గత ఎన్నికల ముందు లోకేష్ - ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు ఏమని ప్రచారం చేసుకున్నారో అందరికీ తెలిసిందే. తమకు అధికారం ఇస్తే సీమాంధ్రను సింగపూర్ గా చేసేస్తామని అన్నారు. సింగపూర్ బొమ్మలను తమ అనుకూల పత్రికల్లో పబ్లిష్ చేయించుకుని.. ఏపీ అలా అయిపోతుంది సుమా.. అని ప్రచారం చేసుకున్నారు. అయితే.. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.

ఐదేళ్లలో పెదబాబు, చినబాబు సాధించింది ఉత్తుత్తి ఎంవోయూలు తప్ప మరేం లేదు అని తేలిపోయింది. పేరుకేమో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అన్నారు. ఆచరణలో మాత్రం వాటి అడ్రస్ లు కనపడవు. కానీ లోకేష్ మాత్రం మళ్లీ పాత కథలే చెబుతూ ఉన్నారు.

అసలు గచ్చిబౌళీ గురించి లోకేష్ కు ఏం తెలుసు? అనే ప్రశ్న కూడా ఇక్కడ వినిపిస్తూ ఉంది. ఆ ప్రాంతం ఏమీ ఒక రోజులోనో, ఒక ఏడాదిలోనో డెవలప్ అయినది కాదు. నేదురుమల్లి జనార్ధన్  రెడ్డి టైమ్ లో మొదలు పెడితే.. ఇప్పటికి ఆ ప్రాంతం అలా ఉంది. దాదాపు పాతిక సంవత్సరాలు! అంత కథ ఉంది.

 అయితే లోకేష్ మాత్రం తనను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే చాలు.. అంతా అయిపోతుందని ప్రకటించుకొంటూ ఉన్నారు. ఇలాంటి కబుర్లే గత ఎన్నికల ముందు చెబితే ప్రజలు నమ్మేశారు. ఐదేళ్ల పాలన చూశారు. మరి ఇప్పుడూ అవే మాటలనే చెబుతున్నారు తెలుగుదేశం అధినేతలు. మరి ఈ సారి ప్రజలు చెవుల్లో పూలు పెట్టుకుంటారా? లెట్ వెయిట్ అండ్ సీ!

   

Tags:    

Similar News