చినబాబుకు కోపం కట్టలు తెగింది

Update: 2019-04-08 06:44 GMT
ప్రజలు దేవుళ్లు.. సమాజం దేవాలయమనే తెలుగుదేశం పార్టీ స్ఫూర్తికి భిన్నంగా  పార్టీలో కీలక నేతల నోటి మాటలు ఉండటం అవాక్కు అయ్యేలా చేస్తున్నాయి. ఎన్నికల్లో తప్పించి విడి రోజుల్లో ఏ మాత్రం మాట్లాడే అవకాశం ఇవ్వని అధినేతలు.. ఎన్నికల వేళ.. చెమటలు చిందిస్తూ రోడ్ల మీదకు వచ్చేస్తుంటారు.

అలాంటి వారు ఆవేదనతోనూ.. ఆగ్రహంతోనూ ప్రశ్నలు సంధిస్తుంటే కోపం కట్టలు తెగుతుంటుంది. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు ఏపీ మంత్రి.. టీడీపీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్. తనను ప్రశ్నిస్తున్న వారిని ఉద్దేశించి ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ప్రచారం నిర్వహిస్తున్న ఆయన్ను ఉండవల్లి దళితవాడ కరకట్ట వద్ద ప్రజలు పలువురు పెద్ద ఎత్తున ప్రశ్నలు సంధించారు.

మీరు పవర్లోకి వచ్చాక రాజధాని పేరుతో మా ఇళ్లను తొలగిస్తారని అంటున్నారు?  నిజమా?  కాదా?  అని ప్రశ్నించారు. దీనికి అలాంటిదేమీ లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ పట్టాలు ఇచ్చాం.. ఇక్కడ పట్టాలిచ్చామనే లోకేశ్ మాటలకు అడ్డుతగిలిన మహిళలు.. ఉన్న ఊళ్లో పట్టాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

దీనికి అసహనం వ్యక్తం చేసిన లోకేశ్.. అక్కడి వారిపై మండిపడటంతో అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బతుకు గురించి ప్రశ్నిస్తే.. ఇలా కోపం ప్రదర్శిస్తే ఎలా అంటున్నారు. ఎన్నికల వేళే ఇంత అసహనంగా ఉంటే.. చేతికి అదికారం వస్తే మా పరిస్థితి ఏమిటి? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు సవాలచ్చ అడుగుతుంటారు. ప్రశ్నించటానికి ప్రజలకు అవకాశం చిక్కేది ఇప్పుడే కదా?  అలాంటప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసే కన్నా.. ఓపిగ్గా సమాధానం చెప్పొచ్చుగా చినబాబు?


Tags:    

Similar News