లోకేష్.. భీమిలి నుంచి పోటీ లేనట్టే!

Update: 2019-03-12 04:36 GMT
ఏపీ మంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాబు  ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు? అనేది కొన్ని నెలలుగా చర్చలో ఉన్న అంశం. దీనిపై అనేక నియోజకవర్గాల పేర్లు వినిపించాయి. లోకష్ వచ్చి తమ తమ నియోజకవర్గాల నుంచి పోటీ చేయవచ్చని అనేక మంది తెలుగుదేశం నేతలే బంపర్ ఆఫర్లు ఇచ్చారు. అయితే లోకేష్ మాత్రం ఎక్కడ నుంచి పోటీకి కూడా సై అని అనలేదు.

ఈ విషయంలో చంద్రబాబు నాయుడు అనేక  సర్వేలు - అధ్యయనాలు చేయించి.. అత్యంత సేఫెప్ట్ నియోజకవర్గాన్ని ఎంచే ప్రయత్నం చేశారని అంటారు. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి లోకేష్ పేరును భీమిలి నుంచి అని లీకు ఇచ్చారు. చంద్రబాబు రాయలసీమ నుంచి పోటీ చేస్తున్న తరుణంలో లోకేష్ విశాఖ జిల్లా నుంచి పోటీ చేసి పార్టీకి ఊపును ఇవ్వబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు భీమిలి విషయంలో కొత్త కథలు వినిపిస్తూ ఉండటం విశేషం.

అనూహ్యంగా భీమిలి విషయంలో కొత్త పేరు  తెరపైకి వచ్చింది. అదే.. సీబీఐ మాజీ జేడీ. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి వీఆర్ ఎస్ తీసుకున్న ఆయన సొంత పార్టీ పెడతారని.. కొన్ని నెలల కిందట వార్తలు వచ్చాయి. బీజేపీలోకి - జనసేనలోకి అని కూడా ఆయన పేరు వినిపించింది. అయితే చివరకు ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారట. భీమునిపట్నం నుంచి పోటీ చేయబోతున్నారట.

మరి నిన్నటి వరకూ లోకేష్ పేరు వినిపించిన నియోజకవర్గం విషయంలో ఇప్పుడు లక్ష్మినారాయణ పేరు తెర మీదకు రావడం విచిత్రమే. అయితే ఇది కూడా కేవలం ఊహాగానమే! స్థానికేతరుడు అయిన లక్ష్మినారాయణ వెళ్లి అక్కడ పోటీ చేస్తే గెలిచేస్తారా? క్లీన్ ట్రాక్ రికార్డు ఉన్న అవంతికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అలాంటి చోట స్థానికేతరుడిని నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడి లెక్కలు ఓకే చెబుతాయా?

అనే అంశాలు సందేహాలతో కూడుకున్నవే. ప్రస్తుతానికి అయితే లోకేష్ భీమిలి నుంచి కాదు అని - విశాఖ ఉత్తర నియోజకవర్గం  నుంచి అని అంటున్నారు.  మరి నామినేషన్ల ప్రారంభానికి మరో ఐదు రోజుల సమయమే ఉంది. అలాంటి నేపథ్యంలో లోకేష్ ఈ సారికి ఎక్కడ నామినేషన్ దాఖలు చేయబోతున్నారో!
Tags:    

Similar News