కేసీఆర్ కు కాలే మాట చెప్పిన లోకేశ్‌!

Update: 2018-09-08 07:09 GMT
సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఏపీ మంత్రి నారా లోకేశ్‌. ముంద‌స్తుకు వెళ్లిన కేసీఆర్  కు.. ఆయ‌న కోరుకున్న‌ట్లుగా క‌థ న‌డిపించిన మోడీకి మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉంద‌న్నారు. దీనికి సంబంధించి ఆయన కొన్ని అంశాల్ని చెప్పుకొచ్చారు. ఏపీలో మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా లోకేశ్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. టీఆర్ ఎస్ నేత‌ల షాకులుగా మారిన‌ట్లుగా చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఏర్ప‌డిన ప్ర‌భుత్వం ప్ర‌జ‌లు త‌మ‌కు ఇచ్చిన ఐదేళ్ల గ‌డువు పూర్తి కాక ముందే ర‌ద్దు కావ‌టం బాధ క‌లిగించిన‌ట్లుగా చెప్పారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నున్న ఆప‌ద్ధ‌ర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏం చెప్పుకుంటారు? అని సూటిగా ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్ స‌ర్కారు సాధించిన అభివృద్ధి ఏమైనా ఉందా? అంటూ మండిప‌డ్డారు.

తెలంగాణ‌లో నిరుద్యోగ భృతి ఇస్తార‌ని తాము అనుకున్నామ‌ని..కానీ కేసీఆర్ స‌ర్కారు ఇవ్వ‌లేద‌న్నారు. ఏడాది వ్య‌వ‌ధిలో ఏపీలో నిర్మించిన‌న్ని ఇళ్లు కూడా తెలంగాణ‌లో నాలుగేళ్ల వ్య‌వ‌ధిలో నిర్మించ‌లేక‌పోయార‌న్నారు. బీజేపీతో క‌ల‌వ‌న‌ని కేసీఆర్ చెబుతున్నార‌ని.. కానీ  క‌మ‌ల‌నాథుల స్కెచ్ ప్ర‌కార‌మే కేసీఆర్ న‌డుస్తున్నార‌ని చెప్పారు.

టీఆర్ ఎస్‌.. బీజేపీల మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉంద‌న్న లోకేశ్‌.. మ‌జ్లిస్ మిత్ర‌ప‌క్షంగా కేసీఆర్ పేర్కొన‌టాన్ని తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు. బీజేపీతో ఓప‌క్క అక్ర‌మ సంబంధాన్ని కొన‌సాగిస్తూ.. మ‌రోవైపు మ‌జ్లిస్ త‌మ మిత్ర‌ప‌క్షంగా పేర్కొన‌టం ఏ మాత్రం స‌రికాద‌న్నారు. టీఆర్ ఎస్‌.. బీజేపీల మ‌ధ్య‌ పెళ్లి సంబంధ‌మైతే గోత్రాలు కావాలి త‌ప్ప‌.. అక్ర‌మ సంబంధానికి గోత్రాల‌తో ప‌నేముంది అంటూ కేసీఆర్ కు ఎక్క‌డో కాలిపోయే మాట‌ను అనేశారు లోకేశ్‌.

నాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కోరిన వెంట‌నేప్ర‌ధాని మోడీ అపాయింట్ ఇచ్చార‌ని.. విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై తాము క‌లుస్తామ‌ని కోరినా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు అనుమ‌తి కూడా ఇవ్వ‌లేదంటున్నారు. ద‌క్షిణాదిన కేసీఆర్ మిన‌హా బీజేపీకి మ‌రెవ‌రూ దొర‌క‌లేదేమో అంటూ ఎద్దేవా చేసిన లోకేశ్‌.. ప్ర‌త్యేక హోదాపై ఏపీకి వ్య‌తిరేకంగా.. కేంద్రానికి సానుకూలంగా కేసీఆర్ వ్య‌వ‌హ‌రించార‌న్నారు. ఎన్నిక‌ల ముందు త‌మ‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ.. ఏపీకి ఎలాంటి మంచి చేయ‌లేద‌న్నారు. అదే స‌మ‌యంలో ఎలాంటి సంబంధం లేకున్నా.. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వానికి కేంద్రం త‌న స‌హాయ స‌హ‌కారాల్ని అందించింద‌ని దుయ్య‌బ‌ట్టారు. లోకేశ్ తాజా వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

   

Tags:    

Similar News