బాల‌య్య‌కు రాజ‌కీయాలు నేర్పుతున్న నారా రోహిత్?!

Update: 2020-01-10 15:56 GMT
అదేంటి?...రెండో ట‌ర్మ్ ఎమ్మెల్యేగా, స్వ‌యంగా ప్రాంతీయ పార్టీ ర‌థ‌సార‌థి అయిన తెలుగుదేశం అధ్య‌క్షుడు చంద్ర‌బాబు స్వ‌యాన బావ‌మ‌రిది నంద‌మూరి బాల‌కృష్ణ‌కు...ఇంకా రాజ‌కీయాల్లోకి అడుగుపెట్ట‌ని బాబు సోద‌రుడి కుమారుడు నారా రోహిత్ రాజ‌కీయాలు నేర్పిస్తున్నాడా? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అవునండి నెట్టింట ఇప్పుడు ఈ చ‌ర్చే జ‌రుగుతోంది. దీర్ఘ‌కాలంగా సినిమాల్లో కొన‌సాగుతూ, ఓ వైపు సినిమాలు మ‌రోవైపు రాజ‌కీయాలు విజ‌య‌వంతంగా స‌మ‌న్వ‌యం చేస్తున్న నంద‌మూరి బాల‌య్య బాబు...ఈ నారా వారి సినీ న‌టుడి నుంచి రాజ‌కీయం నేర్చుకోవాల‌ట‌. ఇంత‌కీ ఏ విష‌యంలో అంటారా? ఏపీలో ప్ర‌తిపాదిత మూడు రాజ‌ధానుల అంశం గురించి.

ప్ర‌తిపాదిత మూడు రాజ‌ధానుల ఆందోళ‌న‌ల‌పై నారా రోహిత్ చేసిన ట్వీట్ ఓ సారి చూడండి. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిది. విభజనతో జీవచ్ఛవంలా మిగిలిన రాష్ట్రానికి.. ప్రాణ సమానమైన భూముల త్యాగం చేసి.. అమరావతి రూపంలో ప్రాణం పోశారు. మీ ఔదార్యంతో అమరావతిలో పాలనకు బాటలు వేశారు. ఆ మార్గం చెదిరిపోకూడదని 23 రోజులుగా మీరు చేస్తున్న పోరాటం భావితరాలకు స్పూర్తిదాయకం. మీ ఉద్యమానికి సంకెళ్లు పడుతున్నా.. అలసిన గుండెలు మూగబోతున్నా మొక్కవోని దీక్షతో ముందడుగు వేస్తున్నారు. మీ పోరాటం వృథా కాదు. త్వరలో మీతో కలిసి మీ పోరాటంలో పాలుపంచుకుంటాను’. ఇది ఆయ‌న ట్వీట్‌.

రాజ‌కీయాల్లో అడుగుకూడా పెట్ట‌ని రోహిత్‌...రాజ‌ధాని ఆందోళ‌న‌ల‌పై స్పందించారు. త‌న అభిప్రాయం వినిపించారు. కానీ...రెండో ద‌ఫా విజ‌య‌వంతంగా ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న బాల‌కృష్ణ మాత్రం...ఏమాత్రం ఈ విష‌యంలో రియాక్ట‌వ‌లేదు. సీమ‌కు మేలు చేయాల‌నే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తించ‌లేదు, వ్య‌తిరేకించ‌లేదు. అమ‌రావ‌తి నుంచి రాజ‌ధాని త‌ర‌లింపుపై సొంత బావ‌, పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు చేస్తున్న పోరాటానికి కూడా మ‌ద్ద‌తివ్వ‌లేదు. వ్య‌తిరేకించ‌లేదు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన వారు త‌న సోదరుడైన లోకేష్‌కు పిల్ల‌నిచ్చిన‌ మామ బాల‌య్య‌కు రాజ‌కీయాల్లో ముఖ్య‌మైన అంశాలలో స్పందించ‌డంపై శిక్ష‌ణ ఇస్తున్నార‌ని ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు.


Tags:    

Similar News