న‌ర‌సింహ‌న్ ఒక్క‌రికే గ‌వ‌ర్న‌ర్ రికార్డ్

Update: 2018-08-22 14:12 GMT
తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ ఎల్‌ నరసింహన్ ఖాతాలో మ‌రో ప్ర‌త్యేక రికార్డ్ న‌మోదు అయింది. సుదీర్ఘకాలం గవర్నర్‌ గా ఉన్న నరసింహన్‌ కు తాజాగా మ‌రో తీపిక‌బురు ద‌క్కింది. మూడు రాష్ట్రాల్లో కొత్త గవర్నర్లను నియమించి - నలుగురు గవర్నర్లను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి భవన్‌ ప్రకటన విడుదల చేసింది.అయితే రెండు రాష్ర్టాల గ‌వ‌ర్న‌ర్‌ గా ఉన్న ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్‌ ను కొన‌సాగించారు. త‌ద్వారా గ‌త కొద్దికాలంగా సాగుతున్న చ‌ర్చ‌కు ఫుల్‌ స్టాప్ ప‌డింది. 2010 జనవరిలో నరసింహన్‌ ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ గా బాధ్యతలు చేపట్టి నాటి నుంచీ కొనసాగుతున్న న‌ర‌సింహ‌న్ ప్ర‌త్యేక‌త‌ను సాధించుకున్నారు.

2007లో యూపీఏ ప్రభుత్వం నరసింహన్‌ ను తొలుత ఛత్తీస్‌ గఢ్‌ గవర్నర్‌ గా నియమించింది. తెలంగాణ ఉద్య‌మం పెద్ద ఎత్తున జ‌రుగుతున్న స‌మ‌యంలో జనవరి 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు బదిలీ చేసింది. రాష్ట్ర విభజన స‌మ‌యంలో ప‌రిస్థితుల‌ను మెరుగైన రీతిలో స‌మ‌న్వ‌యం చేయ‌గ‌లిగార‌ని కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద మంచి అభిప్రాయం ఉంది. అందుకే బీజేపీ ప్ర‌భుత్వం సైతం ఆయ‌న సేవ‌లను నిలిపివేయ‌లేదు. ఎన్డీఏ పాల‌న‌లో కూడా గ‌వ‌ర్న‌ర్ పదవీ కాలాన్ని మూడుసార్లు పొడిగించింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల బాధ్యతలను ఈఎస్ ఎల్ న‌ర‌సింహ‌న్‌ ఒక్కరే చూసుకుంటున్నారు. కేంద్రం ఈసారి ఆంధ్రప్రదేశ్‌ - తెలంగాణలకు వేర్వేరుగా గవర్నర్లను నియమించే అవకాశం ఉందని ప్ర‌చారం సాగింది. కానీ అది ప్ర‌చారానికే ప‌రిమితం అయింది.

తాజా జాబితాలో తెలుగు రాష్ట్రాలకు కొత్త గ‌వ‌ర్న‌ర్ పేరు లేదు. యూపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లలో ఇక మిగిలినది తెలుగు రాష్ర్టాల గవర్నర్‌ నరసింహన్‌ ఒక్కరే. దీంతో సుదీర్ఘ కాలం ఉన్న గ‌వ‌ర్న‌ర్‌ గా న‌ర‌సింహ‌న్ ప్ర‌త్యేక‌త‌ను సాధించుకున్నారు. కాంగ్రెస్ సార‌థ్యంలోని యూపీఏ హ‌యాంలో నియామ‌క‌మై, బీజేపీ సార‌థ్యంలోని ఎన్డీఏ హ‌యాంలో కొన‌సాగుతున్న గ‌వ‌ర్న‌ర్‌గా ప్ర‌త్యేక‌త‌ను సాధించుకున్నారు. విభజన సమయంలో చాకచక్యంగా వ్యవహరించడం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు పెరగకుండా సమర్థంగా వ్యవహరించారనే అభిప్రాయముంది. 2014 తెలంగాణ ఏర్పడిన సమయంలో ఆ రాష్ట్రానికీ ఆయన్నే గవర్నర్‌ గా ఉంచారు.
Tags:    

Similar News